Global Vaartha
Date of Publish : 22/10/2026, 11:06 am
Editor : భవ్య జర్నలిస్ట్

ఎన్నికల కోడ్‌తో పనేంటి!

  • ఎమ్మెల్యే పుట్టా ఇంట మైదుకూరు సబ్‌డివిజన్‌ పోలీసు అధికారులు
  • మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌తో సమావేశమైన పోలీసు అధికారులు
  • స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేసిన టీడీపీ ఎమ్మెల్యే పుట్టా

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ కొనసాగుతోంది. రాజకీయ నేతలందర్నీ అధికారులు సమదృష్టితో చూడాలి. తరతమ భేదం లేకుండా ఎస్‌ఈసీ ఆధ్వర్యంలో నిబంధనలకు లోబడి విధి నిర్వహణ ఉండాలి. కానీ.. వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరు సబ్‌ డివిజన్‌ పోలీసులు ఎన్నికల నిబంధనలు భేఖాతర్‌ చేశారు. నియమావళితో పనేముంది. అధికార పార్టీ ఎమ్మెల్యే చల్లని చూపులు చాలన్నట్టుగా వ్యవహరించారు.

 ప్రొద్దుటూరులో మంగళవారం మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ నివాసంలో మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, సీఐలు శివశంకర్‌యాదవ్, వంశీధర్‌ ఎస్‌ఐలు ధనుంజయుడు (దువ్వూరు), చిరంజీవి (మైదుకూరు), చిన్నపెద్దయ్య (చాపాడు) విద్యాసాగర్‌ (బి.మఠం) తదితర ఎస్‌ఐలతో కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయం కోసమే ప్రత్యేక సమావేశం వెనుక రహస్యమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

 ఎన్నికల కోడ్‌ ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఎలా ప్రత్యేకంగా భేటీ అవుతారని పలువురు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. జిల్లాలో ఎన్నికల కోడ్‌ ఏ స్థాయిలో అమలు అవుతోందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయం ఫొటోతో సహా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save