Global Vaartha
Date of Publish : 22/10/2026, 11:16 am
Editor : భవ్య జర్నలిస్ట్

స్థానిక ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం గొడ్డలి పార్టీకి ‌లేదు: బోండా ఉమ

వైసీపీపై ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యవస్థలను తమ స్వార్ధానికి వాడుకునే విధానం‌ వైసీపీ డీఎన్‌ఏలోనే ఉందని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా చేయడం జగన్ నైజమన్నారు. వారి ప్రభుత్వంలో ఎన్నికల అధికారి రమేష్‌ను ఎలా తిట్టారో చూశామన్నారు. హైకోర్టు న్యాయమూర్తులను కూడా వదలకుండా‌ దూషించారని మండిపడ్డారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల నామినేషన్‌ల సమయంలో మిథున్ రెడ్డి చేసిన అరాచకాలు, దాడులకు మీడియానే సాక్ష్యమన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం గొడ్డలి పార్టీకి ‌లేదని ఎమ్మెల్యే విమర్శించారు. మాచర్లలో తనపై దాడి చేస్తే దేవుడి దయ వల్ల బయటపడినట్లు తెలిపారు. బూత్‌లను క్యాప్చర్ చేసి, అభ్యర్థులను కిడ్నాప్ చేసి, దాడి చేసిన వీడియోలు ఇంకా యూట్యూబ్‌లో ఉన్నాయన్నారు. ఇప్పుడు ఎన్నికలలో వారికి అభ్యర్థులు కూడా లేక ఏకగ్రీవాలు అయ్యాయని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో భయపెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారని.. ఇప్పుడు అభ్యర్థులు దొరక్క ఏకగ్రీవాలు అవుతున్నాయని తెలిపారు.

‘మా పార్టీకి చెందిన అభ్యర్థుల నామినేషన్ పత్రాలను వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి లాక్కున్నారు’ అని బోండా ఉమ ఆరోపించారు. రోజా ఏకంగా పోలీసులనే బెదిరించారన్నారు. వైసీపీ నేతలు నామినేషన్‌లు వేసి ‌కూడా కోర్టుకు వెళ్లారని తెలిపారు. గతంలో బీసీల రిజర్వేషన్‌పై కూడా ఇదే విధంగా‌ కోర్టుకు వెళ్లి అడ్డంకులు సృష్టించారని వైసీపీపై మండిపడ్డారు. వాళ్లే కోర్టులో‌ కేసులు వేసి, వాళ్లే కూటమిపై నిందలు మోపుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కూటమికి ప్రజాబలం ఉందన్నారు. వైసీపీకి చట్టం మీద నమ్మకం లేదని.. ఎన్నికల మీద గౌరవం లేదని ఎమ్మెల్యే బోండా ఉమా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save