Global Vaartha
Date of Publish : 22/10/2026, 11:23 am
Editor : భవ్య జర్నలిస్ట్

పదేళ్ల కనిష్టానికి స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌

  • క్యూ3లో 26 శాతం క్షీణించిన షిప్‌మెంట్స్‌
  • మొత్తం 3.58 కోట్లకు పరిమితం
  • తొలి స్థానానికి చేరిన శాంసంగ్‌
  • మార్కెట్‌ పరిశోధనా సంస్థ ఓమ్డియా నివేదిక వెల్లడి

భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ పదేళ్ల కనిష్టానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ షిప్‌మెంట్లు (సరఫరాలు) వార్షిక ప్రాతిపదికన 26 శాతం తగ్గి 3.58 కోట్ల యూనిట్లకు పరిమితమయ్యాయి. 2016 తర్వాత మూడో త్రైమాసికంలో ఇదే అత్యల్ప స్థాయి అని మార్కెట్‌ పరిశోధనా సంస్థ ఓమ్డియా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఫోన్ల ధరలు పెరగడం, వినియోగదారులు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం, పాత ఫోన్ల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసే డిమాండ్‌ (రీప్లేస్‌మెంట్‌) తగ్గడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. అలాగే, ఆన్‌లైన్‌ విక్రయాలు బలహీనపడటం, ఈ ఏడాది దీపావళి ఆలస్యం కావడం వల్ల సెపె్టంబర్‌లో జరగాల్సిన ‘ఆఫ్‌లైన్‌ పండుగ స్టాకింగ్‌’ అక్టోబర్‌కు వాయిదా పడటం త్రైమాసిక వాల్యూమ్‌ల పతనానికి దారితీసాయని నివేదిక వెల్లడించింది.

మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్న శాంసంగ్‌

మార్కెట్‌ మందగించినప్పటికీ శామ్‌సంగ్‌ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ సంస్థ 67 లక్షల యూనిట్ల షిప్‌మెంట్లతో 19 శాతం మార్కెట్‌ వాటాను సాధించింది. గత ఏడాదితో పోలిస్తే షిప్‌మెంట్స్‌ సుమారు 1 శాతం తగ్గినా, 2024 తొలి త్రైమాసికం తర్వాత తొలిసారి మొదటి స్థానానికి దక్కించుకుంది. గెలాక్సీ ఏ07, ఏ17, ఏ27 మోడళ్లతో పాటు గెలాక్సీ ఎస్‌26 సిరీస్, కొత్త ఫోల్డబుల్‌ ఫోన్లు శాంసంగ్‌కు కలిసొచ్చాయి. బ్యాంక్‌ క్యాష్‌బ్యాక్, ఎక్సే్చంజ్‌ ఆఫర్లు, దీర్ఘకాలిక ఫైనాన్సింగ్‌ సదుపాయాలు షిప్‌మెంట్‌ వృద్ధికి తోడ్పడ్డాయి.

చైనా బ్రాండ్లలో వివో షిప్‌మెంట్‌లు అత్యధికంగా 34 శాతం పడిపోయి 64 లక్షలకు (6.4 మిలియన్లు) చేరగా, ఒప్పో (49 లక్షలు), షావోమీ (47 లక్షలు) కూడా భారీ క్షీణతను చవిచూశాయి. ధరల పెరుగుదల అంచనాల నేపథ్యంలో ఛానెల్‌ స్టాకింగ్‌ జరగడం, ఐఫోన్‌ 17, 16 మోడళ్లకు స్థిరమైన డిమాండ్‌ ఉండటంతో యాపిల్‌ 39 లక్షల (3.9 మిలియన్లు) షిప్‌మెంట్స్‌తో టాప్‌–5 జాబితాలో నిలిచింది. త్రైమాసికం చివరిలో విడుదలైన ఐఫోన్‌ 18 ప్రో, ప్రో మాక్స్‌ లాంచ్‌లు, నో–కాస్ట్‌ ఈఎంఐ ఆఫర్లు యాపిల్‌కు ఊపునిచ్చాయి.

ఆన్‌లైన్‌ ఆఫర్లు వెలవెల..!

‘‘సాధారణంగా ఆన్‌లైన్‌ పండుగ సేల్స్‌ కోసం సెపె్టంబర్‌ నెలలోనే నిల్వలు సిద్ధం చేసుకుంటారు. అయితే ఈసారి కొత్తగా ప్రత్యేక లాంచ్‌లు లేకపోవడం, బడ్జెట్‌ ధరలలో ఫోన్ల లభ్యత తగ్గడం వల్ల ఆన్‌లైన్‌ ఛానెళ్లకు లభించే సాంప్రదాయ పండుగ ప్రయోజనం దెబ్బతింది. ఇది ప్రధానంగా ఆన్‌లైన్‌ విక్రయాలపై ఆధారపడే చైనీస్‌ బ్రాండ్లను దెబ్బతీసింది. ఫలితంగా వారి సంయుక్త మార్కెట్‌ వాటా 75 శాతం నుంచి 68 శాతానికి పడిపోయింది. మరోవైపు శాంసంగ్, యాపిల్‌ సంస్థలు తమ ప్రీమియం పోర్ట్‌ఫోలియోలు, స్ట్రక్చర్డ్‌ అప్‌గ్రేడ్‌ పథకాల ద్వారా మార్కెట్‌లో తమ పట్టును బలోపేతం చేసుకున్నాయి’’ అని ఓమ్డియా ప్రిన్సిపల్‌ అనలిస్ట్‌ సన్యం చౌరాసియా వివరించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save