కత్తిపూడి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన నలుగురు భవానీ భక్తులు మృతిచెందడం తీవ్ర బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. మృతులకు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.కత్తిపూడి ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా అధికారులకు అనిత ఫోన్ చేసి, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు.
మరోవైపు, ఈ ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. భవానీ భక్తుల మృతి తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలు, సదుపాయాలు కల్పించాలని ఆజ్ఞాపించారు. ఈ విషాదాన్ని మృతుల కుటుంబాలు తట్టుకునే మనోధైర్యాన్ని అమ్మవారు ప్రసాదించాలని కోరుకున్నారు.