Global Vaartha
Date of Publish : 22/10/2026, 11:41 am
Editor : భవ్య జర్నలిస్ట్

లాడెన్‌ను గుర్తించిన పాకిస్థాన్‌లోనే దావూద్ ఇబ్రహీం కూడా ఉన్నాడు: ఐరాసలో భారత్

మోస్ట్ వాంటెడ్ నేరస్థుడైన దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నాడని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి స్పష్టం చేసింది. మానవ హక్కులపై ఐరాస ప్రత్యేక ప్రతినిధి బెన్ సాల్ సమర్పించిన నివేదికలో వాస్తవాలకు విరుద్ధమైన అంశాలున్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే నివసిస్తున్నాడని, గతంలో అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ కూడా అక్కడే హతమయ్యాడని భారత దౌత్యవేత్త రఘు పూరి పేర్కొన్నారు (Dawood Ibrahim in Pakistan).ఐరాస ప్రత్యేక ప్రతినిధి బెన్ సాల్ తన నివేదికలో డీ-కంపెనీని భారత్‌కు చెందిన నేర సంస్థగా పేర్కొన్నారు. దాని అధినేత దావూద్ ఇబ్రహీంకు ఉగ్రవాద సంబంధాలున్నాయని నివేదికలో ప్రస్తావించారు. అయితే, దావూద్ 1993 ముంబై వరుస పేలుళ్ల కేసుల్లో నిందితుడని, అతడి కోసం భారత్ చాలా కాలంగా ప్రయత్నిస్తోందనే అంశాన్ని నివేదికలో తగిన రీతిలో ప్రస్తావించలేదని భారత ప్రతినిధి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి కీలక విషయాలను విస్మరించడం వల్ల నివేదికపై విశ్వసనీయత దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు (UN Rapporteur Ben Saul).

దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్నాడని, ఒసామా బిన్ లాడెన్‌ను గుర్తించిన దేశంలోనే అతడు నివసిస్తున్నాడని ఐరాస రికార్డులను ఉటంకిస్తూ రఘు పూరి పేర్కొన్నారు (Pakistan Terrorism). అతడి కోసం భారత్ వెతుకుతోందనే విషయాన్ని కూడా ప్రస్తావించాల్సిందని పూరి అన్నారు. 1993 మార్చి 12న ముంబైలో జరిగిన వరుస బాంబు దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. డీ-కంపెనీ అనే నేర ముఠాకు అతడే నాయకుడని భారత దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి. దావూద్‌ను అప్పగించాలని భారత్ పలుమార్లు పాకిస్థాన్‌ను కోరింది. అతడు పాకిస్థాన్‌లో నివసిస్తున్నాడని భారత్ చెబుతుండగా, పాకిస్థాన్ గతంలో ఈ ఆరోపణలను ఖండించింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save