Global Vaartha
Date of Publish : 22/10/2026, 11:57 am
Editor : భవ్య జర్నలిస్ట్

దారుణ ఘటన.. సవతి తల్లిపై డీజిల్ పోసి నిప్పంటించిన కొడుకు

ఓ యువకుడు సవతి తల్లిని క్రూరంగా చంపేశాడు. ఆమెను ఇంట్లో ఉంచి నిప్పు పెట్టడంతో ప్రాణాలు కోల్పోయింది. జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హౌసింగ్ కాలనీకి చెందిన సుష్మా దేవి (40) అనే మహిళపై ఆమె సవతి కొడుకు మోక్ష వర్మ డిజిటల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు చికిత్స పొందుతూ జమ్ములోని ప్రభుత్వ వైద్య కళాశాల (GMC) ఆసుపత్రిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఉధంపూర్‌లోని హౌసింగ్ కాలనీలో కేశవ్ వర్మ, సుష్మా దేవి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. బుధవారం సాయంత్రం సుష్మా సవతి కొడుకు మోక్ష వర్మ అకారణంగా ఆమెపై దాడికి తెగబడ్డాడు. అంతేకాక ఇంట్లోనే ఆమెపై డీజిల్ పోసి నిప్పు పెట్టాడు. మంటలకు తట్టుకోలేక బాధితురాలు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. ఈ ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు స్థానికంగా కలకలం రేపాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పి, కుటుంబ సభ్యుల సహకారంతో ఆమెను ఉధంపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

అయితే సుష్మా దేవి శరీరం సుమారు 70 శాతానికి పైగా కాలిపోవడంతో, పరిస్థితి విషమంగా ఉన్నందున వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం జమ్ము జీఎంసీకి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. నిందితుడైన మోక్ష వర్మను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు గల అసలు కారణాలు ఏమిటనే కోణంలో పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save