Global Vaartha
Date of Publish : 22/10/2026, 11:59 am
Editor : భవ్య జర్నలిస్ట్

భార్యను ప్రేమగా కౌగిలించుకున్న భర్త.. ఐదు పక్కటెముకలు విరగడంతో షాక్

చైనాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. భార్యకు చలిగా ఉందని ప్రేమగా దగ్గరకు తీసుకున్న భర్తకు ఊహించని అనుభవం ఎదురైంది. జియాంగ్సు ప్రావిన్స్‌కు చెందిన వాంగ్ అనే వ్యక్తి తన భార్యను గట్టిగా కౌగిలించుకోగా.. ఆమె పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. కౌగిలించుకున్న సమయంలో ఒక్కసారిగా శబ్దం రావడంతో పాటు భార్య తీవ్రమైన నొప్పితో బాధపడుతూ కుప్పకూలింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు సీటీ స్కాన్ నిర్వహించి పరీక్షించగా.. ఆమెకు ఐదు పక్కటెముకలు విరిగినట్లు, మరో పక్కటెముకకు పగులు ఏర్పడినట్లు గుర్తించారు.వైద్యుల పరిశీలనలో మహిళకు ఆస్టియోపొరోసిస్‌ ఉన్నట్లు వెల్లడైంది. ఆమె బరువు సుమారు 45 నుంచి 50 కిలోలు మాత్రమేనని, తరచూ రాత్రి భోజనం మానేయడం, రోజూ కాఫీ తాగడం, తగినంత సూర్యరశ్మి పొందకపోవడం వంటి అలవాట్లు ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపి ఉండవచ్చని భర్త తెలిపాడు. ఎముకలు బలహీనంగా ఉన్నవారిలో సాధారణంగా అనిపించే ఒత్తిడి కూడా పక్కటెముకల విరుగుడుకు దారితీయవచ్చని ఈ ఘటన గుర్తుచేస్తోంది. ప్రస్తుతం మహిళకు మందులు, ఆయింట్‌మెంట్లు ఇచ్చిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. శస్త్రచికిత్స అవసరం లేదని నిర్ధారించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రేమతో కూడిన కౌగిలింత సైతం ఆరోగ్య పరిస్థితులను బట్టి ప్రమాదకరంగా మారవచ్చనే ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save