Global Vaartha
Date of Publish : 22/10/2026, 12:15 pm
Editor : భవ్య జర్నలిస్ట్

తైక్వాండో పోటీల్లో పాల్గొన్న మణిపూర్ సీఎం ఖేమ్‌చంద్‌!

 మణిపూర్ ముఖ్యమంత్రి యుమ్నమ్ ఖేమ్‌చంద్ సింగ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆయన్ను గ్లోబల్ ట్రెడిషనల్ తైక్వాండో ఫెడరేషన్ (GTTF) అత్యున్నత పురస్కారమైన 'గ్రాండ్‌మాస్టర్ 9వ డాన్'తో సత్కరించింది. ఖుమాన్ లంపాక్ ఇండోర్ స్టేడియంలో తొలి మణిపూర్ రాష్ట్ర తైక్వాండో ఛాంపియన్‌షిప్-2026 ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జీటీటీఎఫ్ అధ్యక్షుడు గ్రాండ్‌మాస్టర్ జున్ లీ ముఖ్యమంత్రికి గ్రాండ్ మాస్టర్ గౌరవాన్ని అందజేశారు. తైక్వాండో క్రీడలో ఆయన చేసిన దీర్ఘకాలిక సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఖేమ్‌చంద్ తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను, రిఫ్లెక్సెస్ ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తైక్వాండో పుట్టినిల్లయిన దక్షిణ కొరియా నుంచి జీటీటీఎఫ్ అధ్యక్షుడు జున్ లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడం సంతోషమన్నారు. అలానే వారి రాక మణిపూర్ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెడుతుందని అన్నారు.

సీఎం ఖేమ్‌చంద్‌ను జున్ లీ ప్రశంసిస్తూ.. ఆయన 1980ల ప్రారంభంలో భారత్‌లోనే అత్యుత్తమ తైక్వాండో అభ్యాసకులలో ఒకరని జున్ లీ గుర్తుచేశారు. ఆయన అనేక సార్లు నేషనల్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్ గెలుచుకోవడంతో పాటు, భారత్‌లో తైక్వాండోకు ప్రాచుర్యం కల్పించడంలో కీలకపాత్ర పోషించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన రాజకీయ నాయకుడిగా ఉన్నప్పటికీ, అంతకుముందే గొప్ప తైక్వాండో ఛాంపియన్‌గా నిలిచారని ప్రశంసించారు. రాష్ట్ర హోమ్, యువజన వ్యవహారాలు మరియు క్రీడా శాఖ మంత్రి గోవిందాస్ కొంథౌజమ్ మాట్లాడుతూ.. మణిపూర్‌లో అనేక మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని , ఈ ఛాంపియన్‌షిప్ రాష్ట్రంలో బలమైన తైక్వాండో పోటీలకు పునాది వేస్తుందని చెప్పారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save