Global Vaartha
Date of Publish : 22/10/2026, 12:33 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ ఎంట్రీ.. ఆత్మకథ ‘Belonging’ ఫస్ట్ లుక్ విడుదల

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. తొలి పోస్ట్‌లోనే ‘Belonging: A Journey of Love’ పేరుతో రూపొందిన తన ఆత్మకథ ఫస్ట్ లుక్‌ను ఆమె పంచుకున్నారు. తన జీవితంలోని ప్రేమ, కర్తవ్యం, విషాదాలు, తనకంటూ ఒక స్థానం కోసం సాగిన అన్వేషణ వంటి అంశాలను ఈ పుస్తకంలో వివరించినట్లు సోనియా గాంధీ తెలిపారు. తన ఆత్మకథను పాఠకులతో పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

తొలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌గా..

పుస్తకం తొలి ప్రతులను అందుకున్న సోనియా గాంధీ, తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి వాటిని పరిశీలించారు. పుస్తకంలో అనేక ఫొటోలు ఉన్నాయని ఆమె ప్రియాంకతో చెప్పడం వీడియోలో కనిపిస్తుంది. అనంతరం ప్రియాంక తన తల్లికి స్వీట్లు తినిపించగా.. ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియోను సోనియా గాంధీ తన తొలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌గా పంచుకున్నారు.

ఇటలీ బాల్యం నుంచి భారత రాజకీయాల వరకు..

ఈ ఆత్మకథలో సోనియా గాంధీ జీవితంలోని వ్యక్తిగత, రాజకీయ అంశాలను వివరించారు. యుద్ధానంతర ఇటలీలో ఆమె బాల్యం, రాజీవ్ గాంధీతో పరిచయం, వివాహం తర్వాత భారత్‌కు రావడం, నెహ్రూ-గాంధీ కుటుంబంతో ఆమె జీవితం వంటి అంశాలు పొందుపరిచారు. అలాగే, 1984లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్య, 1991లో రాజీవ్ గాంధీ హత్యతో ఆమె జీవితంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలనూ ప్రస్తావించారు. ఆ విషాద ఘటనల తర్వాత సోనియా గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించిన తీరు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆమె పోషించిన పాత్ర గురించీ వివరించారు.

ప్రచురణ సంస్థ మార్పు

ఈ ఆత్మకథను తొలుత ప్రచురించాల్సిన పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది. అనంతరం హార్పర్‌కాలిన్స్ ఇండియా ఈ పుస్తకాన్ని ప్రచురించేందుకు ముందుకొచ్చింది. కాగా, నవంబర్ 10న విడుదల కానున్న ఈ పుస్తకంపై రాజకీయ, సాహిత్య వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save