Global Vaartha
Date of Publish : 22/10/2026, 12:48 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఆటగాళ్ల మధ్య చిచ్చు పెట్టారు.. గ్రెగ్ చాపెల్‌పై హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..

భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్‌పై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్ర విమర్శలు చేశాడు. చాపెల్ కోచ్‌గా ఉన్న సమయంలో ఆటగాళ్ల మధ్య విభేదాలు పెరిగాయని, ఒకరితో మరొకరు గొడవపడే పరిస్థితులు ఏర్పడ్డాయని వెల్లడించాడు. అప్పట్లో ఎంతో ఐకమత్యంతో ఉన్న భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాపెల్ వల్ల దెబ్బతిందని పేర్కొన్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఆ కాలాన్ని అత్యంత కష్టమైన దశల్లో ఒకటిగా అభివర్ణించాడు (Harbhajan Singh about Greg Chappell).తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన హర్భజన్.. చాపెల్ కోచింగ్ శైలిపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. అప్పట్లో ఆటగాళ్ల మధ్య ఐక్యతను పెంచాల్సిన కోచ్, వారిని విడదీసేలా వ్యవహరించారని ఆరోపించాడు. సౌరవ్ గంగూలీతో చాపెల్ వ్యవహరించిన తీరు కూడా జట్టుపై ప్రభావం చూపిందని అన్నాడు. 2003 ప్రపంచకప్‌లో ఫైనల్ వరకు చేరిన భారత జట్టులో ఆటగాళ్ల మధ్య మంచి అనుబంధం ఉండేదని, చాపెల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు మారాయని పేర్కొన్నాడు (2007 Cricket World Cup).

జట్టులో ఒకరిపై మరొకరికి అనుమానం కలిగించేలా చేసి, తాను చెప్పినట్లే నడుచుకునే పరిస్థితి తీసుకొచ్చారని హర్భజన్ విమర్శించాడు. ఆ సమయంలో ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తుండేదని, ఆ జట్టుకు టీమిండియా మాత్రమే గట్టి పోటీ ఇచ్చేదని హర్భజన్ పేర్కొన్నాడు (Greg Chappell Controversy). అలాంటి జట్టు ఐకమత్యంగా ఆడకుండా పరిస్థితులు మారిపోయాయని అన్నాడు.

డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు పెరిగితే మైదానంలోనూ దాని ప్రభావం కనిపిస్తుందని, 2007 ప్రపంచకప్‌లో భారత్ ఘోర ఓటములను ఎదుర్కొందని, గ్రూప్ దశ దాటలేకపోయిందని గుర్తు చేశాడు. కాగా, 2007 ప్రపంచకప్ పరాజయం దేశవ్యాప్తంగా అభిమానులను నిరాశకు గురిచేసింది. జట్టులో అంతర్గత విభేదాలు, ఆటగాళ్ల ఎంపిక, కోచ్ విధానంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రపంచకప్‌లో భారత్ వైఫల్యం తర్వాత చాపెల్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save