Global Vaartha
Date of Publish : 22/10/2026, 1:02 pm
Editor : భవ్య జర్నలిస్ట్

నకిలీ వాట్సాప్ నిర్వాహకులకు పవన్ కల్యాణ్ కార్యాలయం హెచ్చరిక

ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేస్తున్నారంటూ వచ్చిన వార్తలపై పవన్ కళ్యాణ్ కార్యాలయం స్పందించింది. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరిట నకిలీ వాట్సాప్ ఛానల్ నిర్వాహకులకు అధికారిక హెచ్చరిక జారీ చేసింది. ‘Deputy CMO, Andhra Pradesh’ పేరుతో నిర్వహిస్తున్న వాట్సాప్ ఛానల్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన అధికారిక ఛానల్ కాదని స్పష్టం చేసింది. ఈ అనధికారిక ఛానల్ ద్వారా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరును, గుర్తింపును దుర్వినియోగం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని, సంబంధం లేని ఇతర అంశాలను ప్రచారం చేస్తోందని తెలిపింది.ఇలా అధికారిక కార్యాలయంగా తప్పుడు గుర్తింపుతో వ్యవహరించడం, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇటువంటి చర్యలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం కఠినంగా వ్యవహరిస్తుందని పవన్ కార్యాలయం వార్నింగ్ ఇచ్చింది. ఈ నకిలీ ఛానల్ వ్యవహారంపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు తగిన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ నకిలీ ఛానల్‌ను ప్రజలు విశ్వసించొద్దని, అనుసరించవద్దని, అందులోని సమాచారాన్ని ఇతరులకు పంపించవద్దని సూచించింది.

ప్రామాణికమైన సమాచారం, అధికారిక తాజా వివరాల కోసం ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన అధికారికంగా గుర్తింపు పొందిన సోషల్ మీడియా ఖాతాలను, ధృవీకరించిన వాట్సాప్ ఛానల్‌ను మాత్రమే అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ కార్యాలయ గుర్తింపును దుర్వినియోగం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని.. బాధ్యులైన వారిని చట్టం ఎదుట నిలబెట్టి, తగిన చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ కార్యాలయం హెచ్చరించింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save