దేశ ప్రజలందరికీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అలాయ్ బలాయ్, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆకలి, దప్పులు లేని సమాజాన్ని నిర్మించడంతో పాటు అవినీతికి, అఘాయిత్యాలకు తావులేని దేశంగా భారత్‌ను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.గతంలో భారతీయుల మధ్య ఉన్న విభేదాలను బ్రిటిష్ పాలకులు తమకు అనుకూలంగా మలుచుకుని దేశాన్ని పాలించారని, ఆ క్రమంలో మన సంస్కృతి, సంప్రదాయాలను దెబ్బతీశారని గుర్తుచేశారు. అందువల్ల ప్రజల మధ్య ఐక్యత, పరస్పర గౌరవం, సోదరభావం ఎంతో అవసరమని పేర్కొన్నారు. మనుషుల మధ్య ప్రేమను పంచుతూ, ఆత్మీయ అనుబంధాలను బలోపేతం చేసే గొప్ప వేదిక అలాయ్ బలాయ్ అని అన్నారు. మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన మధ్య ఉన్న అనుబంధాలను ఇతరులతో పంచుకోవాలని సూచించారు.దేశానికి, సమాజానికి అన్నింటికంటే ముఖ్యమైనది ఐక్యత అని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. భారతీయులందరూ భిన్నత్వాన్ని గౌరవిస్తూ సమైక్యంగా ఉండాలని, ప్రకృతితో మమేకమై జీవించే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. దేశాభివృద్ధితో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ముఖ్యంగా మాతృభాష తెలుగును పరిరక్షించాలని పిలుపునిచ్చారు. మాతృభాష మన కంటి చూపు లాంటిదని, దానిని నిర్లక్ష్యం చేయకుండా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు మన సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పాలని అన్నారు. పరస్పర కలహాలకు దూరంగా ఉంటూ ప్రేమ, ఆప్యాయత, మానవత్వంతో ముందుకు సాగినప్పుడే అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.