తాను రాజీనామా చేస్తున్నానంటూ ఓ వాట్సాప్ ఛానల్‌లో వచ్చిన వార్తలపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. దీంతో సంబంధిత వాట్సాప్ గ్రూపప్ అడ్మిన్ స్పందిస్తూ.. క్షమాపణ చెప్పింది. పవన్ రాజీనామా చేస్తున్నారంటూ ఓ వార్తను సోషల్ మీడియాలో చూసి నిజానిజాలు తెలుసుకోకుండా, తొందరపాటుతో షేర్ చేసినట్లు పేర్కొంది. ఇది పొరపాటున, ఎలాంటి దురుద్దేశం లేకుండా జరిగిందని వివరించింది.‘ఈరోజు ఉదయం గ్రూప్‌లో నేను ‘పవన్ కల్యాణ్ Deputy CM పదవికి రాజీనామా’ చేస్తున్నారంటూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ వార్త సోషల్ మీడియాలో చూసి, నిజానిజాలు పూర్తిగా నిర్ధారించుకోకుండా, తొందరపాటులో షేర్ చేయడం జరిగింది. అది ఒక తప్పుడు వార్త (Fake News) అని తర్వాత తెలిసింది. దీనిపై డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి అధికారికంగా స్పందన వచ్చి, చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇందుకు నేను హృదయపూర్వకంగా చింతిస్తున్నాను. ఇది పొరపాటున, ఎటువంటి దురుద్దేశం లేకుండా జరిగింది. పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రూప్ సభ్యులందరికీ నా తరపున క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఇకపై ఎటువంటి వార్త అయినా పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతనే పోస్ట్ చేస్తానని హామీ ఇస్తున్నాను. దయచేసి నన్ను మన్నించగలరు’ అంటూ సంబంధిత వాట్సాప్ అడ్మిన్ గ్రూప్ సభ్యుడు క్షమాపణ చెబుతూ వివరణ ఇచ్చారు.