Global Vaartha
Date of Publish : 22/10/2026, 2:14 pm
Editor : భవ్య జర్నలిస్ట్

గుండా లక్ష్మీదేవి వైఎస్సార్‌సీపీలో కి

శ్రీకాకుళం జిల్లాలో అధికార టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. టీడీపీ సీనియర్‌ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి.. టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం, వైఎస్సార్‌సీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన గుండా లక్ష్మీదేవి.. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా గుండా లక్ష్మీదేవికి వైఎస్‌ జగన్‌​ పార్టీ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు.అనంతరం లక్ష్మీదేవి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీలో 40 ఏళ్లుగా పనిచేశాం. నా భర్త నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎంతో నిబద్ధతతో పనిచేశారు. కానీ నాటి విలువలు, సిద్ధాంతాలు, మంచి విధానాలు ఇప్పుడు ఆ పార్టీలో లేవు. నా భర్త విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనీయకుండా అడ్డుకున్నారు. విలువల్లేని టీడీపీలో ఉండలేకే వైఎస్సార్‌సీపీలో చేరుతున్నాను. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలేవీ జరగడం లేదు. రైతులకు అవసరమైనవి అందడం లేదు.. ఆస్పత్రుల్లో మందులు లేవు. అనేక రంగాల్లో రాష్ట్రం వెనుకబడిపోతోంది. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్‌సీపీలో చేరుతున్నా. గతంలో ఏ పార్టీలో ఉన్నా ఎంతో నిబద్ధతతో పనిచేశాం. వైఎస్సార్‌సీపీలోనూ అదే నిబద్ధతతో పనిచేస్తాం. ప్రజల కోసం ఎవరుంటే వారితో ఉండాలనుకున్నాను అని అన్నారు.

కాగా, గుండా లక్ష్మీదేవి కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుబంధం ఉంది. ఆమె భర్త, దివంగత మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. లక్ష్మీదేవి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. లక్ష్మీదేవితో పాటుగా ఆమె ముఖ్య అనుచరులు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save