కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన జనసేన కీలక నేత పాఠంశెట్టి సూర్యచంద్ర దంపతులు వైఎస్సార్‌సీపీలో చేరారు.గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో పాఠంశెట్టి సూర్యచంద్ర, ఆయన సతీమణి శ్రీదేవితో పాటు వారి ముఖ్య అనుచరులు వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.నియోజకవర్గంలో బలమైన పట్టు..
‘వైఎస్సార్‌సీపీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ గ్రామస్థాయి నుంచి ప్రజలకు సేవ చేస్తున్నాను. మూడు సార్లు సర్పంచ్‌గా పనిచేసి, మా గ్రామాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిపాను. 2019లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన తర్వాత కూడా ఐదేళ్లపాటు రాత్రింబవళ్లు ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం పోరాడాను.
2024 ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 12,531 ఓట్లు సాధించాను. ఎన్నికల తర్వాత కూడా ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీస్తున్నాను. వైఎస్ జగన్ నాయకత్వంపై నమ్మకంతో, తోట నరసింహం గారి ఆధ్వర్యంలో నా భార్య శ్రీదేవి, మా అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరడం గర్వంగా భావిస్తున్నాను. వైఎస్సార్‌సీపీ కార్యకర్తగా జగ్గంపేట నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, ప్రజలకు మేలు జరిగేలా పనిచేస్తాను.
ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైంది. కనీసం పది శాతం హామీలైనా నెరవేర్చకుండా ప్రజలను మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్న కూటమి నాయకులను ప్రజలు నిలదీయాలి. పెన్షన్లు, ఇళ్లు, స్థలాలు, ఇతర సంక్షేమ పథకాల పేరుతో ఇంటింటికీ వెళ్లి హామీలు ఇస్తున్న నాయకులను గత రెండున్నరేళ్లలో ఏం చేశారని ప్రశ్నించాలి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మేయర్, వార్డు సభ్యుల స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. వైఎస్ జగన్ గారు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు, రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే వరకు నా శక్తివంచన లేకుండా పనిచేస్తాను’ అని స్పష్టం చేశారు.