Global Vaartha
Date of Publish : 23/10/2026, 10:27 am
Editor : భవ్య జర్నలిస్ట్

పారా ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో రెండు స్వర్ణాలు..

 జపాన్ వేదికగా జరుగుతున్న పారా ఆసియా క్రీడలు -2026లో భారత అథ్లెట్లు దూసుకెళ్తున్నారు. నిన్న రెండు స్వర్ణాలు భారత్ ఖాతాలోకి రాగా..తాజాగా బ్యాడ్మింటన్ విభాగంలో కూడా రెండు స్వర్ణ పతకాలు దక్కాయి. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్‌-3 విభాగంలో నితేశ్ కుమార్‌, ఎస్‌ఎల్‌-4 విభాగంలో నవీన్ శివకుమార్ పసిడి పతకాలను కైవసం చేసుకున్నారు.ఎస్‌ఎల్‌-3 ఫైనల్ పోరులో భాగంగా ఇద్దరూ భారత్ అథ్లెట్లు నితేశ్ కుమార్, ప్రమోద్ భగత్ తలపడ్డారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ తుది పోరులో నితేశ్ 21-18, 21-16 తేడాతో భగత్‌పై విజయం సాధించి పసిడిని ముద్దాడాడు. అందుకున్నారు. గత ఆసియా క్రీడల్లో తృటిలో స్వర్ణం కోల్పోయిన తాను.. ఈసారి రెండు సెట్లలోనే విజయం సాధించడం ఎంతో ప్రత్యేకంగా ఉందని నితేశ్ ఆనందం వ్యక్తం చేశాడు. హ్యాట్రిక్ స్వర్ణం లక్ష్యంగా బరిలోకి దిగిన ప్రమోద్ భగత్ స్వల్ప తప్పుల కారణంగా రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇక పురుషుల ఎస్‌ఎల్‌-4 సింగిల్స్ ఫైనల్‌లో నవీన్ శివకుమార్ అంచనాలకు మించి రాణించాడు. ఇండోనేషియా ఆటగాడు ఫ్రెడీ సెటియావాన్‌తో జరిగిన పోరులో నవీన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. కేవలం 36 నిమిషాల వ్యవధిలోనే 21-9, 21-17 తేడాతో ఫ్రెడీని చిత్తు చేసి ఘన విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ రెండు విజయాలతో పారా ఆసియా క్రీడల్లో 2026లో భారత్ ఖాతాలో 24వ స్వర్ణ పతకం చేరింది. ఈ టోర్నీలో భారత పారా అథ్లెట్ల నిలకడైన ప్రదర్శన క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save