తూర్పు మధ్య - ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా, ఎల్లుండికి తీవ్రవాయుగుండంగా రూపాంతరం చెందుతుందని వెల్లడించారు. సోమవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.ఆ తదుపరి 2 రోజుల్లో ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరాల వైపు తీవ్రవాయుగుండం కదిలే సూచనలు ఉన్నాయని ప్రఖర్ జైన్ వివరించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతాంగం ముందస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని ప్రఖర్ జైన్ సూచించారు.