ఎన్నికల సంఘం సీనియర్ అధికారి మనీశ్ గార్గ్ పనితీరుపై ఎలక్షన్ కమిషనర్లు చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు క్యాబినెట్ సెక్రటేరియట్ నిరాకరించింది. సదరు లేఖలు కమిషనర్ల వ్యక్తిగత హోదాలో వచ్చాయని.. వాటిని ఎన్నికల సంఘం మొత్తానికీ ఆపాదిస్తూ, అధికారిక ఫిర్యాదుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఈ విషయం సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద వెలువడిన ఓ డాక్యుమెంట్ ద్వారా వెలుగులోకి వచ్చింది.కాగా.. ఎన్నికల సంఘం సీనియర్ ఆఫీసర్ మనీశ్ గార్గ్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ.. ఈసీలు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలు ఈ ఏడాది జులై 29న క్యాబినెట్ కార్యదర్శి టి.వి.సోమనాథన్‌కు విడి విడిగా లేఖలు రాశారు. మనీశ్ గార్గ్.. ఉన్నతాధికారుల పని బాధ్యతలను ఇష్టానుసారంగా మార్చారని.. దీనిపై ఈసీతో గానీ, సంబంధిత అధికారులతో గానీ చర్చించకుండానే సొంత నిర్ణయం తీసుకున్నారని వారు ఆరోపించారు. ఇదే విషయమై గతంలో ఇచ్చిన ఆదేశాలనూ పట్టించుకోలేదని, వాటికి సంబంధించిన ఫైల్స్ కోరినా స్పందన లేదని వివేక్ జోషి చెప్పుకొచ్చారు. ఈ మార్పులు ఎన్నికల సంఘంలో అనుసరిస్తున్న విధి విధానాలు సహా 2023 నాటి సీఈసీ, ఈసీల నియామకం, పని నిబంధనలు, పదవీకాల చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని సుఖ్‌బీర్, వివేక్ జోషిలు అభ్యంతరం తెలిపారు.
అయితే.. ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ అని, దాని వ్యవహారాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోరాదని ఆర్టీఐ ద్వారా వెలువడిన పత్రాల్లో క్యాబినెట్ సెక్రటేరియట్ తెలిపింది. ఈ విషయమై ఎన్నికల కమిషన్‌లోని అందరు సభ్యుల నుంచి అధికారిక సమాచారమేమీ లేనందున వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకోవడం సబబు కాదని వివరించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. రాజ్యాంగ సంస్థ పనితీరులో జోక్యం చేసుకున్నట్టు అవుతుందని పేర్కొంది. ఈ మేరకు ఇద్దరు ఈసీలు రాసిన లేఖలను స్వీకరించినట్టు తెలుపుతూ.. సంబంధిత కాపీలను సీఈసీ కార్యాలయానికి పంపాలని సూచించింది. గార్గ్‌కు సంబంధించి భవిష్యత్తులో ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సంబంధిత విభాగాలకు నోట్ పంపింది.
ఇక.. గార్గ్ జారీచేసిన పని బాధ్యతల మార్పు ఉత్తర్వులు ఇద్దరు కమిషనర్ల ఆదేశాల మేరకే అమలు కాలేదని ఎన్నికల సంఘం సెప్టెంబర్ 26న వెల్లడించింది. ఈ వివాదం విధానపరమైన అంశాలకు లేదా సమాచార సాంకేతిక విభాగం పనితీరుకు సంబంధించింది కాదని, డిప్యుటేషన్‌పై ఉన్న అధికారికి సంబంధించినదని స్పష్టం చేసింది.