Global Vaartha
Date of Publish : 23/10/2026, 11:42 am
Editor : భవ్య జర్నలిస్ట్

ఈఫిల్ టవర్ వివాదంపై బ్రహ్మవిహారి స్వామీజీ వివరణ.. బాప్స్‌పై అపార్థం తొలగిపోతుందా?

 పారిస్‌లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ వద్ద మహిళా ఉద్యోగులను పక్కకు తప్పించారనే వివాదంపై బాప్స్ (BAPS) సంస్థకు చెందిన బ్రహ్మవిహారి స్వామీజీ స్పష్టతనిచ్చారు. ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన వరల్డ్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన.. ఈ ఘటనకు ప్రధాన కారణం ఈఫిల్ టవర్ నిర్వహకుల వైపు నుంచి జరిగిన సమాచార లోపమేనని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులను తొలగించాలని తమ సంస్థ ఎలాంటి విజ్ఞప్తీ చేయలేదని స్పష్టం చేశారు. ‘ఇది ఈఫిల్ టవర్ వైపు నుంచి జరిగిన అపార్థం. నేను వారినీ నిందించడం లేదు’ అని పేర్కొన్నారు. తన వివరణతో బాప్స్ సంస్థపై ఏర్పడిన అపార్థం తొలగిపోతుందని భావిస్తున్నట్లు బ్రహ్మవిహారి స్వామీజీ ఆశాభావం వ్యక్తం చేశారు.

అసలేం జరిగింది..?

ఈ ఏడాది సెప్టెంబర్ 5న బాప్స్‌కు చెందిన సుమారు 100 మంది సభ్యుల బృందం ఈఫిల్ టవర్‌ను సందర్శించింది. వీరిలో పలువురు సాధువులు, సంస్థ ఆధ్యాత్మిక ప్రముఖులు ఉన్నారు. అయితే, ఈ పర్యటన సందర్భంగా మహిళా ఉద్యోగులను కొన్ని ప్రాంతాల నుంచి తప్పించి, వారి స్థానాల్లో పురుష ఉద్యోగులను నియమించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మహిళల పట్ల వివక్ష చూపించారంటూ పలువురు విమర్శలు గుప్పించారు.

విచారణలో ఏం తేలింది..?

ఈ ఘటనపై పారిస్ నగర జనరల్ ఇన్‌స్పెక్టరేట్ విచారణ చేపట్టింది. మహిళలను మొత్తం సందర్శనా మార్గం నుంచి తొలగించాలని బాప్స్ ప్రతినిధి బృందం స్పష్టమైన అభ్యర్థన చేసినట్లు ఆధారాలు లభించలేదని విచారణలో తేలింది. ఈఫిల్ టవర్ నిర్వహణ సంస్థ ఎస్ఈటీఈ స్పందిస్తూ.. మహిళా ఉద్యోగులతో సంభాషణలను పరిమితం చేసే ఏర్పాట్లను బాప్స్ ప్రతినిధి బృందం కోరిందని అంగీకరించింది. అయితే, ఆ షరతులను అంగీకరించి ఉండకూడదని అభిప్రాయపడింది. అంతర్గత విచారణలో కార్యనిర్వహణ లోపాలను గుర్తించిన ఆ సంస్థ అధిపతి పాట్రిక్ బ్రాంకో రుయివో ఈ ఏడాది చివరిలో పదవి నుంచి వైదొలుగుతానని ప్రకటించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save