Global Vaartha
Date of Publish : 23/10/2026, 12:05 pm
Editor : భవ్య జర్నలిస్ట్

హింసకు పాల్పడితే ఉపేక్షించేది లేదు

  • నామినేషన్ల అడ్డగింత, పత్రాల ధ్వంసంపై డీజీపీ సీరియస్‌

స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసకు పాల్పడినా, నామినేషన్ల దాఖలును అడ్డుకున్నా ఉపేక్షించేది లేదని డీజీపీ హెచ్చరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా గురువారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొత్తం 31 ఘటనలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. వీటిలో హింస, ఘర్షణలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినవి 22 కాగా.. నామినేషన్‌ పత్రాలను లాక్కోవడం, చించివేయడానికి సంబంధించినవి తొమ్మిది ఉన్నాయని తెలిపారు. అనంతపురంలో అత్యధికంగా 8 ఘటనలు నమోదయ్యాయి. వీటిలో 3 హింసాత్మక ఘటనలు కాగా.. 5 నామినేషన్‌ పత్రాల ధ్వంసానికి సంబంధించినవి. అన్నమయ్య, కడప, ప్రకాశం జిల్లాల్లో మూడేసి చొప్పున హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

తిరుపతిలో 3, చిత్తూరు, శ్రీ సత్యసాయి, పల్నాడు జిల్లాల్లో రెండేసి హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. నెల్లూరు, కర్నూలు, మార్కాపురం జిల్లాల్లో ఒక్కొక్క హింసాత్మక ఘటన నమోదైంది. నంద్యాల, ఏలూరు జిల్లాల్లో నామినేషన్‌ పత్రాలను చించివేసిన ఘటనలు వెలుగుచూశాయి. మొత్తం 16 సందర్భాల్లో పత్రాలను లాక్కోవడం, చించివేయడం లేదా ధ్వంసం చేయడం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 6 ఘటనల్లో రాళ్లు రువ్వడం, రాళ్లు లేదా కర్రలతో దాడులు చేయడం చోటుచేసుకున్నాయి. రెండు కార్లు, రెండు మోటార్‌సైకిళ్లు కలిపి నాలుగు వాహనాలకు నిప్పుపెట్టారు. రెండు నివాస గృహాలపై దాడులతోపాటు ధ్వంసానికి పాల్పడ్డారు. వీటిలో ఒక ఇంటిని ఎర్త్‌మూవర్‌తో కూల్చివేసిన ఘటన కూడా ఉంది. మరోచోట గాలిలోకి కాల్పులు జరిపారు..

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save