Global Vaartha
Date of Publish : 23/10/2026, 12:38 pm
Editor : భవ్య జర్నలిస్ట్

మహిళా డాక్టర్ చెంప చెల్లుమనిపించిన నిందితుడు.. వీడియో వైరల్..

వార్ధా జిల్లాలో మహిళా వైద్యురాలిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడటం కలకలం రేపింది. వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకొచ్చిన ఓ కేసు నిందితుడు.. పోలీసుల ఎదుటే డాక్టర్‌పై దాడికి తెగబడ్డాడు. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం, దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై వైద్య సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విధి నిర్వహణలో ఉన్న వైద్యులు, సిబ్బందికే రక్షణ లేకపోతే మిగతావారి పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.వార్ధా జిల్లా అర్వి తాలూకాలోని తలేగావ్ శ్యామ్‌జీ పంత్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య పరీక్షల నిమిత్తం నిందితుడు కదిర్ అలీ రజాక్ అలీని ఐదుగురు పోలీసులు తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం అతడిని పోలీసులు కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. అయితే, అక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్యాధికారిణి డాక్టర్ శ్రద్ధా భూమ్రే నిందితుడికి పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరమైన పత్రాలపై రజాక్ అలీ సంతకం చేయాల్సి ఉంది. దీంతో డాక్టర్ ఎదుట కూర్చున్న అతను సంతకం చేసేందుకు లేచాడు. ఎక్కడ సంతకం చేయాలో వైద్యురాలు అతడికి చూపించారు. సంతకం చేసిన నిందితుడు తన ఎదురుగా కూర్చున్న మహిళా వైద్యురాలిపై దాడికి తెగబడ్డాడు. ఒక్కసారిగా ఆమె చెంపపై కొట్టాడు. తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆమె.. వెంటనే కుర్చీలో నుంచి లేచి నిలబడ్డారు. అనంతరం అక్కడే ఉన్న పోలీసులు నిందితుడిని గట్టిగా పట్టుకుని, మరోసారి దాడి చేయకుండా అడ్డుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దాడిని గెజిటెడ్ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. వార్ధా జిల్లా కలెక్టర్ వన్మతి సీని కలిసి ఆ సంఘం నేతలు వినతిపత్రం సమర్పించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఐదుగురు పోలీసు సిబ్బందిపైనా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుడి దాడిని అడ్డుకోవడంలో వారు విఫలమయ్యారని ఆరోపించారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ విభాగం (ఓపీడీ) సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. కాగా, ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save