కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కరవు పరిస్థితికి కాంగ్రెస్ కారణమని ఆరోపించారు. ఇది కాలం తెచ్చిన కరవు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరవు అంటూ ‘ఎక్స్’ వేదికగా వ్యాఖ్యలు చేశారు. ఎల్‌నినోపై వాతావరణ నిపుణులు ముందస్తుగా హెచ్చిరించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు.
కేటీఆర్ పోస్ట్...
‘కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది!! జూన్ 01, 2026 నుంచి ఈరోజు వరకు 750 టీఎంసీల గోదావరి నీళ్లను, 250 టీఎంసీల కృష్ణా నీళ్లను దిగువకు విడిచిపెట్టింది ఈ కాంగ్రెస్ సర్కార్. కన్నెపల్లి, దేవాదుల పంపులను సరిగ్గా వాడుకుని గోదావరిపై ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపే అవకాశామున్నా పట్టించుకోలేదు. పాలమూరు - రంగారెడ్డి, కేఎల్ఐ పంపులను ఆన్ చేయకుండా కృష్ణా నీళ్లను వృథా చేశారు. ఎల్‌నినో వస్తుందని ఈ ఏడాది మార్చ్ నుంచే వాతావరణ నిపుణులు హెచ్చరించినా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు’ అంటూ ఎక్స్‌లో కేటీఆర్ పోస్ట్ చేశారు.