Global Vaartha
Date of Publish : 23/10/2026, 2:03 pm
Editor : భవ్య జర్నలిస్ట్

దేశంలో కేసీఆర్ కీలకం కాబోయే రోజులు దగ్గరలో ఉన్నాయి: కేటీఆర్

గత ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు (శుక్రవారం) తెలంగాణ భవన్‌లో అంబర్‌పేట నేతల సమావేశంలో కాంగ్రెస్, బీజేపీపై మాజీ మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. అడ్డమైన మాటలు, ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎప్పుడు ఎన్నిక వస్తుందా.. కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కరెంట్ లేక రైతులు గోస పడుతున్నారని.. ఎల్‌నినో అని 10 నెలల ముందే ప్రభుత్వాన్ని వాతావరణ నిపుణులు అప్రమత్తం చేశారని చెప్పారు.మేడిగడ్డ కూలిందని తప్పుడు ప్రచారం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. రాహుల్ గాంధీని తీసుకువచ్చి కాళేశ్వరం కూలిందని అబద్ధపు మాటలు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరన్నారు. కేసీఆర్‌పై విమర్శలు చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటవుతాయని విమర్శించారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందంటూ వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి హడావుడి ఇంకా ఒక్క సంవత్సరమే అని... ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి అన్నారు. తెలంగాణలో లూటీ పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. మళ్లీ దేశంలో కేసీఆర్ కీలకం కాబోయే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు దేశంలో కీలకం కాబోతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save