Global Vaartha
Date of Publish : 23/10/2026, 2:52 pm
Editor : భవ్య జర్నలిస్ట్

స్థానిక ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై ఏపీ ఎస్‌ఈసీకి వర్లరామయ్య ఫిర్యాదు

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న అన్యాయాలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య (TDP MLC Varla Ramaiah) ఈరోజు (శుక్రవారం) ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలను అడ్డుకునేందుకు హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లిన వైసీపీ నేతలకు చుక్కెదురైందని అన్నారు. సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి కనీస అవగాహన లేదని ధ్వజమెత్తారు.

వైసీపీ కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు..

19 ప్రాంతాల్లో ఫిర్యాదులను పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే, ఎన్నికల కమిషన్ 100 చోట్ల పరిశీలించి 4 ప్రాంతాల్లో కొత్త నామినేషన్లకు అవకాశం ఇచ్చిందని వర్ల రామయ్య తెలిపారు. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి 8 చోట్ల వైసీపీ నేతలు చేసిన దౌర్జన్యాలపై వీడియోలు, పేపర్ క్లిప్పింగ్స్‌తో ఏపీ ఎస్‌ఈసీకి తాము ఫిర్యాదు చేశామని తెలిపారు. వైసీపీ కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తిస్తూ పోలీసులపై దాడులకు పాల్పడుతూ.. బారికేడ్లు విరగ్గొడుతున్నారని ఆగ్రహించారు.

జగన్ రాజ్యాంగబద్ధంగా పోరాడాలి..

మాచర్లలో 300 మందితో రాళ్లు, కర్రలతో దాడులు చేసి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పోలీసులను అడ్డుకున్నారని మండిపడ్డారు. వైసీపీ ఒక దోపిడీదారుల, అసాంఘిక, అరాచక శక్తుల పార్టీ అని విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీసులతో ముందస్తు అరెస్టులు చేయించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో జగన్ ధనబలం, కండబలంతో కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పోరాడాలని వర్ల రామయ్య హితవు పలికారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save