Global Vaartha
Date of Publish : 23/10/2026, 3:09 pm
Editor : భవ్య జర్నలిస్ట్

మెటా కళ్లద్దాలతో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం: కర్ణాటక సీఎం

 కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. తనపై స్టింగ్ ఆపరేషన్‌కు ప్రయత్నం జరిగిందని చెప్పారు. తనతో పాటు కేరళ సీఎం వీడీ సతీశన్‌ను కూడా టార్గెట్ చేశారని ఆరోపించారు. స్థానిక మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం ఈ ఆరోపణలు గుప్పించారు.మెటా స్మార్ట్ కళ్లద్దాలు ధరించిన ఓ వ్యాపారవేత్త తనను కలిసేందుకు రావడంతో అనుమానం కలిగిందని కర్ణాటక సీఎం చెప్పారు. దీంతో, ఆ వ్యాపారవేత్త ఇంకా ఏయే రాజకీయ నాయకుల్ని కలిశారో తెలుసుకునేందుకు ప్రయత్నించానని అన్నారు. కాంగ్రెస్ నేతలే టార్గెట్‌గా భారీ స్టింగ్ ఆపరేషన్‌కు ప్రణాళికలు రెడీ అయ్యాయని ఆరోపించారు. అందులో భాగంగానే తనను టార్గెట్ చేశారని చెప్పారు.అధికారుల ద్వారా అపాయింట్‌మెంట్ తీసుకుని ఓ పారిశ్రామికవేత్త తనను కలిసేందుకు వచ్చారని సీఎం డీకే శివకుమార్ చెప్పారు. తొలుత వ్యాపార వ్యవహారాలు మాట్లాడాక విషయం రాజకీయాలవైపు మళ్లిందని అన్నారు. రాజకీయ పరిణామాలు, బూత్ స్థాయి వ్యూహాల గురించి ఆ పారిశ్రామికవేత్త మాట్లాడటం ప్రారంభించారని చెప్పారు. చర్చ సడెన్‌గా రాజకీయాల వైపు మళ్లడంతో పాటు ఆ వ్యక్తి పెట్టుకున్న కళ్లద్దాలను చూశాక తనకు అనుమానం కలిగిందని అన్నారు.

వ్యాపారవేత్త బ్యాక్‌గ్రౌండ్ ఏంటో కనుక్కోవాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఆ వ్యాపారవేత్త స్మార్ట్ గ్లాసెస్ పెట్టుకున్నట్టు తనకు ఆ తరువాత సమాచారం వచ్చిందని తెలిపారు. కేరళ సీఎం వీడీ సతీశన్‌తో సమావేశం సందర్భంగా కూడా ఆ వ్యక్తి మెటా గ్లాసెస్ ధరించినట్టు తెలిసిందని అన్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలతో సమావేశం సందర్భంగా మాత్రం ఆయన ఇలాంటి కళ్లద్దాలు పెట్టుకోనట్టు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేబినెట్ సహచరులకు సూచించానని అన్నారు.స్టింగ్ ఆపరేషన్‌కు ప్రయత్నించిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ వ్యవహారంలో పోలీసులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. విషయాలను గోప్యం ఉంచుతున్నారని వెల్లడించారు. ‘చర్యలు తీసుకోవట్లేదని మీకు ఎవరు చెప్పారు? మీకు తెలీదు అంతే.. మేము ఈ విషయాలను బయటకు చెప్పట్లేదు’ అని సీఎం డీకే శివకుమార్ అన్నారు.

ప్రస్తుతం కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సంబంధించి స్టింగ్ ఆపరేషన్‌ తాలుకూ వీడియోలు కలకలం రేపుతున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. తనపై ఇంతటి కుట్ర జరుగుతుంటే మాజీ సీఎం సిద్దరామయ్య ఎందుకు మౌనంగా ఉంటున్నారని కేంద్ర మంత్రి కుమార స్వామి ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టింగ్ ఆపరేషన్ వెనుక ఎవరున్నారో, ఏ లక్ష్యంతో ఈ ఆపరేషన్‌కు తెరతీశారో అనే అంశాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save