Global Vaartha
Date of Publish : 23/10/2026, 3:44 pm
Editor : భవ్య జర్నలిస్ట్

స్మిత్ క్యాచ్ వ్యవహారం.. భయంతోనే ముఖం తిప్పుకున్నా: బవుమా

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా చేసిన ఓ పని మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ క్యాచ్ ఇచ్చిన సమయంలో బవుమా ముఖం తిప్పుకోవడం చర్చనీయాంశమైంది. తాజాగా దీనిపై బవుమా స్పందిస్తూ అసలు విషయం వెల్లడించాడు.ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 83వ ఓవర్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కగిసో రబాడ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బ్యాట్‌కు సరిగ్గా తగలకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మాథ్యూ బ్రెట్జ్కే తొలుత క్యాచ్‌ను అందుకోవడంలో తడబడినా.. చివరికి బంతిని ఒడిసిపట్టాడు. అయితే బ్రెట్జ్కే క్యాచ్ అందుకునే సమయంలో కెప్టెన్ బవుమా మాత్రం అటువైపు చూడకుండా ప్రేక్షకుల వైపు ముఖం తిప్పుకున్నాడు. బవుమా ఆ క్యాచ్‌పై నమ్మకం లేకే అలా చేశాడా? అంటూ కామెంటేటర్లు కూడా సరదాగా వ్యాఖ్యానించారు.

మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన బవుమా.. తాను ఎందుకు ముఖం తిప్పుకున్నాడో వివరించాడు. ‘ఆ సమయంలో నేను చాలా నర్వస్‌గా ఉన్నాను. స్టేడియంలో గాలి బలంగా వీస్తున్నప్పుడు ఎత్తుగా వచ్చే క్యాచ్‌లను అందుకోవడం కష్టంగా ఉంటుంది. క్యాచ్ ఎవరు పడుతున్నారనో కూడా నాకు కనపించలేదు. అందుకే అలా చేశాను. అంతేకానీ, ఆ ఫీల్డర్‌పై నమ్మకం లేక కాదు. మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ వికెట్ మాకు అత్యంత కీలకం. అతడు వారి బ్యాటింగ్ లైనప్‌లో అత్యంత డేంజరెస్ ప్లేయర్. అందుకే ఆ సమయంలో నా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోయాను’ అని బవుమా స్పష్టం చేశాడు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save