Global Vaartha
Date of Publish : 23/10/2026, 4:50 pm
Editor : భవ్య జర్నలిస్ట్

అంతర్జాతీయ క్రికెట్‌కు భారత మహిళా ప్లేయర్ రిటైర్‌మెంట్

భారత మహిళా క్రికెటర్ మేఘన సబ్బినేని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. తన క్రికెట్ ప్రయాణంలో అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, కోచ్‌లు, సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, అభిమానులకు మేఘన కృతజ్ఞతలు తెలిపింది. 30 ఏళ్లకే ఆటకు దూరమవుతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.‘చేతిలో బ్యాట్ పట్టుకుని మైదానంలోకి అడుగుపెట్టి ప్రపంచ వేదికపై దేశ జెర్సీ ధరించడం నా కల. అది నిజమైంది. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌లో ప్లేయర్‌గా నా ప్రయాణాన్ని ముగించాలని నిర్ణయించుకున్నా. ఈ సమయంలో నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. మైదానం నాకు రెండో ఇల్లు లాంటిది. పట్టుదల, వినయాన్ని నేర్పడంతో పాటు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు, స్నేహాలను అందించింది. అయితే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ క్రికెట్‌తో నా అనుబంధం కొనసాగుతుంది. భవిష్యత్తులో యువ క్రికెటర్లకు మార్గనిర్దేశం చేస్తూ, ఆట అభివృద్ధికి తన వంతు కృషి చేయాలని భావిస్తున్నా’ అని మేఘన వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ నుంచి టీమిండియా వరకు..

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కుడిచేతి వాటం బ్యాటర్ మేఘన 2016 నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసింది. 2022 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లోకి ప్రవేశించింది. భారత జట్టు తరఫున మూడు వన్డేలు, 17 టీ20లు ఆడింది. వన్డేల్లో 114 పరుగులు, టీ20ల్లో 258 పరుగులు సాధించింది. మేఘన కెరీర్‌లో 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ ఓ ముఖ్యమైన మైలురాయి. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో తొలిసారిగా మహిళల క్రికెట్‌కు చోటు కల్పించగా.. భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. అయితే తుది పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆ జట్టులో మేఘన కూడా సభ్యురాలిగా ఉంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save