Global Vaartha
Date of Publish : 23/10/2026, 4:54 pm
Editor : భవ్య జర్నలిస్ట్

కోయంబత్తూరులో విషాదం.. కులం, ఆహార అలవాట్లపై వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!

తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన పదకొండవ తరగతి విద్యార్థి (పదహారేళ్ల అఖిలన్) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాలలో కులం పేరుతో, ఆవు మాంసం తినే అలవాటుపై తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుడు చేసిన తీవ్రమైన వేధింపుల తాళలేక అఖిలన్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అఖిలన్, స్కాలర్‌షిప్ అప్లై చేసేందుకు క్లాస్ టీచర్ దగ్గరకు వెళ్లాడు. ఈ క్రమంలో కుల వివరాలు, ఆహార అలవాట్లు ఉపాధ్యాయుడు అడిగి తెలుసుకున్నారు. ఆవు మాంసం తింటావా లేదా? అని అడిగినప్పుడు తాను షెడ్యూల్డ్ కులానికి చెందినవాడనని, ఆవు మాంసం తింటానని అఖిలన్ చెప్పాడు.అప్పటి నుంచి గత రెండు నెలలుగా తోటి విద్యార్థులు అఖిలన్‌ని ఒంటరిని చేసి, కులం పేరుతో, ఆహార అలవాట్లపై తీవ్రంగా ఎగతాళి చేస్తూ మానసిక హింసకు గురిచేశారు. ఈ వేధింపులపై బాధితుడు, అతడి తల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి (హెడ్‌మాస్టర్) అలాగే తరగతి ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.స్కూల్‌లో నిరంతరం ఎదురవుతున్న మానసిక వేధింపులు తాళలేక అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన ఆ బాలుడు తన ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు.

దీంతో పీళమేడు పోలీసులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, తరగతి ఉపాధ్యాయుడు (విజయకుమార్), ఇద్దరు తోటి విద్యార్థులపై ఆత్మహత్యకు ప్రేరేపించడం, షెడ్యూల్డ్ కులాలు/తెగలపై వేధింపుల నిరోధక చట్టం (ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం) కింద కేసులు నమోదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి క్లాస్ టీచర్‌ని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు రాష్ట్ర ఆదిద్రవిడ, గిరిజన సంక్షేమ కమిషన్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని కోయంబత్తూరు నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. ఘటనపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు, హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. (Coimbatore Student Suicide)

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save