Global Vaartha
Date of Publish : 23/10/2026, 8:11 pm
Editor : భవ్య జర్నలిస్ట్

సీబీఐ ఎంట్రీ,డెత్ కేసులో కీలక పరిణామం

సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ (లాకప్) డెత్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సీబీఐ ప్రత్యేక కోర్టులో ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేశారు.సీబీఐ అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో ఈ కేసుకు సంబంధించిన విచారణ అధికారికంగా ప్రారంభమైంది. దర్యాప్తులో భాగంగా సీబీఐ బృందం విజయవాడకు చేరుకుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో కలిసి, ఈ ఘటనకు కేంద్ర బిందువైన కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ను సీబీఐ అధికారులు సందర్శించి అక్కడ సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు. ఇప్పటివరకు సిట్ సేకరించిన రికార్డులు, ఆధారాలను సీబీఐ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకుని క్షేత్రస్థాయి విచారణను వేగవంతం చేశారు.

ఏపీ హైకోర్టు కీలక తీర్పు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు విజయవాడకు చేరుకుని విచారణ ప్రారంభించారు. అలాగే, బాధితురాలు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి రూ. 25 లక్షల పరిహారాన్ని నాలుగు వారాల్లోపు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save