Global Vaartha
Date of Publish : 23/10/2026, 9:25 pm
Editor : భవ్య జర్నలిస్ట్

హింసకు పాల్పడితే కఠిన చర్యలు

  • స్థానిక ఎన్నికల్లో హింసకు పాల్పడితే కఠిన చర్యలు.. ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరిక

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు ఏపీ పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఎన్నికల్లో హింస, బెదిరింపులకు పాల్పడే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో డీజీపీ ఇవాళ మంగళగిరిలో సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు.అభ్యర్థులు నిరాటంకంగా నామినేషన్లు దాఖలు చేయడానికి, చట్టబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనేందుకు పూర్తి రక్షణ కల్పిస్తామని ఈ సందర్భంగా డీజీపీ తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు, బెదిరింపులు లేదా అడ్డంకులను సహించేది లేదని, నామినేషన్ కేంద్రాల వద్ద బారికేడ్లు దాటడం, రహదారుల దిగ్బంధం, విధుల్లో ఉన్న పోలీసులపై దాడులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని డీజీపీ హెచ్చరించారు.
నామినేషన్ల దాఖలు సందర్భంగా వివిధ జిల్లాల్లో చోటుచేసుకున్న ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశామని డీజీపీ వెల్లడించారు. పల్నాడు, కడప, అనంతపురం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, మార్కాపురం వంటి జిల్లాల్లో నమోదైన ఘటనలకు సంబంధించి నిందితులను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు.
ఆధారాలు లేకుండా ఎవరినీ కేసుల్లో ఇరికించమని, అలాగే ఏ రాజకీయ నేపథ్యం ఉందనే కారణంతో ఎవరినీ రక్షించమని డీజీపీ తేల్చి చెప్పారు. రాజకీయ అనుబంధం ఆధారంగా ఎలాంటి పక్షపాత చర్యలు (బైండోవర్లు) ఉండవన్నారు.
సీసీటీవీ దృశ్యాలు, డ్రోన్ కెమెరాలు, పోలీస్ బాడీ కెమెరాల రికార్డింగ్‌ల ద్వారా హింసకు పాల్పడిన వారిని, ప్రేరేపించిన వారిని స్పష్టంగా గుర్తించి చర్యలు తీసుకుంటామని డీజీపీ చెప్పారు. సున్నితమైన ప్రాంతాలు, నామినేషన్ కేంద్రాల వద్ద ముందస్తుగా అదనపు పోలీసు బలగాలను మోహరించామని, ప్రచార ర్యాలీలు, ప్రచార వాహనాలు, మైకుల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని డీజీపీ పేర్కొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు, ఎన్నికలు పారదర్శకంగా జరగడానికి ప్రజలు, రాజకీయ నాయకులు, అభ్యర్థులు సహకరించాలని, ఏవైనా బెదిరింపులు లేదా ఆటంకాలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏపీ డీజీపీ ప్రజలకు పిలుపునిచ్చారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save