Global Vaartha
Date of Publish : 24/10/2026, 3:18 pm
Editor : భవ్య జర్నలిస్ట్

స్థానిక ఎన్నికల్లో వైసీపీ అరాచకాలపై ఎస్‌ఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

 ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సృష్టించిన అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్‌ఈసీ) కూటమి నేతలు వర్ల రామయ్య, చిల్లపల్లి శ్రీనివాస్, పాతూరి నాగభూషణం ఫిర్యాదు చేశారు. ప్రజలు అంగీకరించకపోవడంతో, స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాగైనా ఆపేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. నామినేషన్ పత్రాలను వారే చించుకుని, బారికేడ్లు పడేసి, పోలీసులపై దాడులు చేస్తూ వైసీపీ నేతలు దొంగ నాటకాలు ఆడుతున్నారని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ గ్యాంగ్ వ్యవహారశైలి స్టూవర్టుపురం, కంజరభట్ ముఠాల తరహాలో తయారైందని విమర్శించారు.మున్సిపాలిటీల్లో 8,128, జెడ్పీటీసీల్లో 1,815, ఎంపీటీసీల్లో 20,556 స్థానాల్లో వైసీపీ నామినేషన్లు వేసిందని.. మరి వాళ్లను ఎక్కడ అడ్డుకున్నట్లు అని కూటమి నేతలు ప్రశ్నించారు. ఐదున్నరేళ్లుగా జగన్ మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఆరాచకాలకు సంబంధించిన ఆధారాలను పెన్ డ్రైవ్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఇచ్చామని.. సిట్ వేసి విచారించాలని కోరామని చెప్పారు. ఎన్నికలు ఆగిపోతే పంచాయతీలు, స్థానిక సంస్థలకు ఏటా వచ్చే రూ.15 వేల కోట్ల నిధులు ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఎన్నికలు జరిగితే కూటమి గెలుస్తుందనే భయంతోనే, రాయలసీమ, ప్రకాశం జిల్లాలో వైసీపీ కావాలనే గొడవలు సృష్టిస్తోందని కూటమి నేతలు ఆరోపించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save