Global Vaartha
Date of Publish : 24/10/2026, 3:43 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఎల్ నినో, కరవుపై బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ నేతల కౌంటర్..

  • కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది: మంత్రి అడ్లూరి
  • ఫామ్‌హౌస్‌లో కూర్చొని విషం చిమ్ముతున్నారు: వేముల వీరేశం

ఎల్ నినో ప్రభావం, కరవు పరిస్థితులపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని పరిస్థితులను వివరిస్తూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ వేముల వీరేశం విమర్శలు గుప్పించారు. కరోనా సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని మంత్రి అడ్లూరి ఆరోపించగా.. ఫామ్‌హౌస్‌లో కూర్చొని ప్రభుత్వంపై విమర్శలు చేయడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని వేముల వీరేశం మండిపడ్డారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ మీడియా హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఎల్ నినోపై బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టారు.

కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది: మంత్రి అడ్లూరి

కరోనా మహమ్మారి సమయంలో తన సొంత చెల్లిని కోల్పోయానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి ఉంటే తన చెల్లి ప్రాణాలతో ఉండేదని వ్యాఖ్యానించారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వ అసమర్థత కారణంగానే కరోనా మందులు బ్లాక్ మార్కెట్‌లోకి వెళ్లాయని ఆరోపించారు. ఆ సమయంలో కనీసం మాస్కులు కూడా అందించలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. మహమ్మారి సమయంలో కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆరోపించారు. కరోనా మరణాలకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహిస్తారా? అని అడ్లూరి ప్రశ్నించారు.

కరోనా సంక్షోభ సమయంలో కాంగ్రెస్ పార్టీ హుందాగా వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు. కరవుకు కాంగ్రెస్ కారణమైతే, కరోనా సంక్షోభానికి బీఆర్ఎస్ కారణమా? అని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ నేతల విమర్శలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. ఎల్ నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపించే ప్రకృతి సంబంధిత పరిణామమని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులను రాజకీయాలతో ముడిపెట్టి విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందిస్తున్నారని, విపత్తుల సమయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని తెలిపారు. తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మంత్రి అడ్లూరి ధీమా వ్యక్తం చేశారు.

ఫామ్‌హౌస్‌లో కూర్చొని విషం చిమ్ముతున్నారు: వేముల వీరేశం

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ప్రభుత్వ విప్ వేముల వీరేశం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫామ్‌హౌస్‌లో కూర్చొని ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. కరవుకు కాంగ్రెస్ కారణమని చెప్పే కేసీఆర్‌ను సైంటిస్టుగా అభివర్ణిస్తూ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు. కరోనా సంక్షోభానికి కేసీఆర్ కారణమని తాము చెప్పడం లేదని, అయితే కరవు పరిస్థితులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు సరికావని వీరేశం వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్‌లో నీటి ప్రవాహానికి కేసీఆర్ కారణమని, కేసీఆర్ వల్లే ఏపీకి నీళ్లు వచ్చాయని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని వేముల వీరేశం పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు బురదలో ఉంటూ ఇతరులపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎల్ నినో ప్రభావంపై రైతులను ప్రభుత్వం ఎప్పటి నుంచో అప్రమత్తం చేస్తోందని తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను చిల్లర మాటలు, చిల్లర వాగ్దానాలుగా అభివర్ణిస్తూ వీరేశం మండిపడ్డారు.

కాగా, ఎల్ నినో ప్రభావం, కరవు పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ విమర్శలు మరింత తీవ్రతరం అవుతున్నాయి. ఒకవైపు గత ప్రభుత్వ హయాంలో కరోనా నిర్వహణలో వైఫల్యాలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుండగా.. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తుండటంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save