Global Vaartha
Date of Publish : 25/10/2026, 11:18 am
Editor : భవ్య జర్నలిస్ట్

మహారాష్ట్రలో సంచలనం.. బీజేపీ కూటమిలో చిచ్చు

మహారాష్ట్ర రాజకీయాల్లో రూ.500 కోట్ల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమ నేత మనోజ్‌ జరాంగే పాటిల్‌ విడుదల చేసిన ఓ ఆడియో క్లిప్‌ అధికార కూటమిలో చిచ్చు రేపింది. బీజేపీ నుంచి తనకు రూ.500 కోట్లు శివసేన ఎంపీ శ్రీకాంత్‌ షిండే ద్వారా అందాయని ఓ మహిళ ఆడియోలో పేర్కొన్నట్లు జరాంగే వెల్లడించారు. దీంతో అధికార కూటమిలోని బీజేపీ, ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య మాటల యుద్ధం మొదలైంది. అయితే, ఈ ఆరోపణలను ఏక్‌నాథ్‌ షిండే, శ్రీకాంత్‌ షిండే ఖండించారు.2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనకు రూ.500 కోట్లు శ్రీకాంత్‌ షిండే ద్వారా అందాయంటూ బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోందని జరాంగే గతంలో ఆరోపించారు. తాజాగా ఓ మీడియా సమావేశంలో ఆడియో క్లిప్‌ను వినిపించారు. అందులో ఓ మహిళ రూ.500 కోట్లను శ్రీకాంత్‌ షిండే ద్వారా జరాంగేకు అందించినట్లు చెబుతున్నారని కథనాలు వెల్లడించాయి. మరాఠ్వాడాలో జరాంగే ప్రభావాన్ని తగ్గించే అంశంపై కూడా కొందరు మాట్లాడుకున్నట్లు సమాచారం.
షిండే ఖండన.. ఫడ్నవీస్‌ విచారణకు ఆదేశం
తనకు కానీ, తన కుమారుడికి కానీ రూ.500 కోట్లు ఇచ్చింది లేదని, తీసుకున్నదీ లేదని ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే స్పష్టం చేశారు. ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని జరాంగేకు సూచించారు. ఆధారాలు ఉంటే సంబంధిత దర్యాప్తు సంస్థలకు అందించాలని కోరారు. మరోవైపు, ఆడియో క్లిప్‌పై ఫోరెన్సిక్‌ పరీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆదేశించారు. ఈ వ్యవహారంపై రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సంభాషణలు ఎందుకు వెలుగులోకి వచ్చాయన్న ప్రశ్నను ఆయన లేవనెత్తారు.బీజేపీ, శివసేన నేతల మధ్య ఎదురుదాడి
ఈ వ్యవహారంపై శివసేన నేత, మాజీ మంత్రి రాందాస్‌ కదమ్‌ స్పందిస్తూ.. ఏక్‌నాథ్‌ షిండేను రాజకీయంగా దెబ్బతీసేందుకు బీజేపీలోని కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్సీలు ప్రవీణ్‌ దరేకర్‌, ప్రసాద్‌ లాడ్‌ పేర్లను ప్రస్తావించారు. దీనిపై బీజేపీ నేతలు కూడా ఘాటుగా స్పందించారు. తమ పార్టీపై ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. అయితే, తర్వాత ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ప్రయత్నాలు జరిగాయి. శివసేన మంత్రి ఉదయ్‌ సామంత్‌ తనతో మాట్లాడిన అనంతరం ఈ అంశం ముగిసిందని ప్రసాద్‌ లాడ్‌ పేర్కొన్నారు. ఏక్‌నాథ్‌ షిండేను తమ పెద్దన్నగా గౌరవిస్తామని చెప్పారు.
ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మిత్రపక్షాల మధ్య ఇప్పటికే విభేదాలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఆడియో వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆరోపణలు నిజమా, లేక రాజకీయ వివాదంలో భాగమా అన్నది విచారణ తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save