Global Vaartha
Date of Publish : 25/10/2026, 11:29 am
Editor : భవ్య జర్నలిస్ట్

ఓట్లడిగేందుకు ఏ ముఖం పెట్టుకుని వచ్చారు?

  • టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థిని ప్రశ్నిస్తున్న మహిళ

మీ ప్రభుత్వం వచ్చాక పథకాలన్నీ మీరు, మీ కార్యకర్తలే దక్కించుకున్నారు. అన్ని అర్హతలున్నా మమ్మల్ని విస్మరించారు. నేతన్నల పేరుతోనూ మీరే దోచుకుతిన్నారు. అర్హులకు ‘నేతన్నసేవలో’ పథకం అందకుండా చేశారు. పోనీ పట్టణంలో ఏమైనా అభివృద్ధి చేశారా అంటే అదీ లేదు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మమ్మల్ని ఓట్లు అడిగేందుకు వచ్చారు’’ అంటూ ధర్మవరం ప్రజలు టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులను కడిగిపారేస్తున్నారు.
ధర్మవరం మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి పార్టీ అభ్యర్థులు ఆయా వార్డుల్లో ప్రచారాలకు వెళ్తుంటే ఓటర్లు తిరగబడి ప్రశ్నిస్తున్నారు. శనివారం 4వ వార్డులో టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి ప్రచారానికి వెళ్లగా కొందరు ఇళ్లలోంచి బయటకు కూడా రాలేదు. మరికొందరు ఓటర్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏం చేశారని మీకు ఓట్లెయ్యాలో చెప్పాలంటూ నిలదీశారు.
మగ్గాలున్న తమకు కాకుండా ఆటో డ్రైవర్లకు, మెకానిక్‌లకు ‘నేతన్న సేవలో’ పథకం డబ్బులు పడ్డాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాము ఎన్నిసార్లు ఫోన్లు చేసినా కనీసం ఎత్తలేదని, చేనేత పథకం కింద డబ్బులు పడలేదని స్వయంగా వచ్చి విన్నవించినా పట్టించుకోలేదని...ఇప్పుడు మాత్రం ఓట్లు అడిగేందుకు ఎలా వచ్చారంటూ నిలదీశారు. దీంతో వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియని కూటమి అభ్యర్థులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. కూటమి అభ్యర్థులను ఓటర్లు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save