Date of Publish : 25/10/2026, 4:14 pm
Editor : భవ్య జర్నలిస్ట్
గంగానదిపై గగన విన్యాసాలు.. 'వింగ్స్ ఓవర్ గంగా' ప్రదర్శనను తిలకించిన ప్రధాని మోదీ
- గంగానది తీరాన గగనతల విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారత వైమానిక దళం 94వ వార్షికోత్సవం సందర్భంగా వారణాసిలోని నమో ఘాట్ వద్ద నిర్వహించిన వింగ్స్ ఓవర్ గంగ ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోదీ తిలకించారు
భారత వైమానిక దళం 94వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న పవిత్ర నమో ఘాట్ వద్ద ఆదివారం 'వింగ్స్ ఓవర్ గంగా' (Wings over Ganges) పేరుతో నిర్వహించిన వైమానిక ప్రదర్శనను (Aerial Display-2026) ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై తిలకించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.
వైమానిక దళానికి చెందిన సుప్రసిద్ధ 'సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్' (SKAT), 'సారంగ్ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్' తమ అద్భుతమైన గగనతల విన్యాసాలతో అలరించాయి. స్వదేశీ ఫైటర్ జెట్ తేజస్ (Tejas), లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచండ్ (LCH Prachand), ఫ్రంట్‌లైన్ ఫైటర్ జెట్లు సుఖోయ్ (SU-30MKI), రఫేల్ (Rafale), రవాణా విమానాలు IL-76, IL-78, C-295, AN-32లు ఈ విన్యాసాలలో పాల్గొన్నాయి.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌తో పాటు భారత నావికాదళం (Indian Navy), భారత ఆర్మీకి చెందిన విమానాలు, హెలికాప్టర్లు కూడా పాల్గొని సాయుధ దళాల సంయుక్త సామర్థ్యాన్ని చాటిచెప్పాయి.
వారణాసిలో దుస్తుల తయారీ యూనిట్ ప్రారంభోత్సవం, మహిళా సమ్మేళనం
ఏరియల్ డిస్ప్లే కార్యక్రమానికి హాజరుకావడానికి ముందు ప్రధాని మోదీ వారణాసిలో 'అరవింద్ లిమిటెడ్' నూతన దుస్తుల తయారీ కేంద్రాన్ని (Garment Manufacturing Facility) ప్రధాని ప్రారంభించారు. ఇది పూర్తిగా మహిళల నేతృత్వంలో సాగే పారిశ్రామిక ప్రాజెక్ట్ కావడంతో ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి, మహిళా సాధికారతకు ఎంతో దోహదపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఇవాళ వారణాసి పర్యటనకు విచ్చేసిన ప్రధానికి స్థానిక మహిళలు జాతీయ జెండాలు, బీజేపీ జెండాలు చేతబూని, సాంప్రదాయ దప్పులు వాయిస్తూ రోడ్డు పొడవునా ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ మహిళా సాధికారతకు చేస్తున్న కృషికి గాను వారంతా కృతజ్ఞతలు తెలిపారు
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.