కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి 2029 ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక కొర్రపాడు రోడ్డులోని ఎస్.కె.ఎస్.సి. డిగ్రీ కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కారు ద్వారా అభివృద్ధి జరుగుతోందన్నారు. కూటమి పాలనలో ఇప్పటికే దాదాపు 28 నెలలు పూర్తయ్యాయని, ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నంద్యాల రాఘవరెడ్డికి ఓటు రాకపోతే దేవుడు ఆయనవైపు ఉన్నాడని రాచమల్లు వ్యాఖ్యానించారని, ఇప్పుడు రాఘవరెడ్డికి పోటీ చేసే అవకాశం లభించిందని ఆదినారాయణరెడ్డి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడు ఎవరివైపు ఉన్నారో రాచమల్లే చెప్పాలన్నారు. ప్రొద్దుటూరు వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహ రెడ్డి సంతకం కూడా లేకుండా నామినేషన్ ఎలా దాఖలు చేశారని ప్రశ్నించారు. పులివెందులలో 40 కౌన్సిలర్ స్థానాలకు గాను దాదాపు 21 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని పేర్కొంటూ, గతంలో ఏకగ్రీవాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన వైసీపీ నాయకులు దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రజలను ఆకట్టుకునేందుకు విమర్శలు చేయడం కాకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలని రాచమల్లుకు సూచించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో దోపిడీ జరిగిందని, టిడ్కో ఇళ్ల విషయంలోనూ ప్రజలకు అన్యాయం జరిగిందని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. ప్రొద్దుటూరు అభివృద్ధికి అవసరమైన నిధులను గత పాలకులు సక్రమంగా వినియోగించలేదని విమర్శించారు. గతంలో రాచమల్లు, తాను ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు ఇబ్బందులు ఎదురైన సందర్భాల్లో తాము చేసిన సహాయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. రాజకీయాల్లో అసత్య ఆరోపణలు చేయడం, ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని, రాచమల్లు తన భాషను మార్చుకోవాలని హితవు పలికారు. తనను వ్యక్తిగతంగా విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి నిధులు కోరుతున్నారని, పట్టణానికి త్వరలో మరిన్ని నిధులు తీసుకొస్తామని ఆదినారాయణరెడ్డి తెలిపారు. ఇప్పటికే రూ.45 కోట్ల హామ్ నిధులు మంజూరయ్యాయని, కొప్పర్తికి అదనపు నిధులతో పాటు రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. జిల్లాలో స్టీల్ ప్లాంట్, జమ్మలమడుగులో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు అడ్డంకులు ఎదురైనా వాటిని పూర్తి చేస్తామని ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు తగ్గి అభివృద్ధికి ప్రాధాన్యం పెరుగుతోందని పేర్కొన్నారు. మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, మహిళా రిజర్వేషన్లు, దిశ, పోక్సో చట్టాల అమలు ద్వారా వారి భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యువతకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుకు రూ.2,000 ఇస్తామని కూటమి చెప్పలేదని, ప్రజలపై నిజంగా ప్రేమ ఉంటే రాచమల్లు తన డబ్బును ప్రజలకు పంచాలని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ నియామకాల విషయంలో గత ప్రభుత్వ తీరును కూడా ఆయన విమర్శించారు. ప్రొద్దుటూరుకు మంచి మున్సిపల్ కమిషనర్ వచ్చారని, పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆదినారాయణరెడ్డి కోరారు. ఎలినినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో కలెక్టర్ కరువు మండలాలను ప్రకటించారని తెలిపారు. అభివృద్ధి పనులను అడ్డుకోకుండా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి సౌమ్యులని, అవసరమైతే తామంతా కలిసికట్టుగా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. త్వరలో గ్రామ పంచాయతీల్లోనూ ఏకగ్రీవాలు జరిగే అవకాశం ఉందని, భవిష్యత్తులో రాష్ట్రంలో త్రిపుల్ ఇంజన్ సర్కారు ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి ముక్తియార్, టీడీపీ యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి, ఈవీ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు