Global Vaartha
Date of Publish : 25/10/2026, 10:58 pm
Editor : భవ్య జర్నలిస్ట్

తుపాను హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

  • అధికార యంత్రాంగానికి హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావంతో సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు, మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో హోంమంత్రి వంగలపూడి అనిత అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

బుధవారం బాపట్ల–విశాఖపట్నం తీరాల మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగులను వెంటనే తొలగించాలని, అవసరమైతే తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలి

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా జాతీయ విపత్తు స్పందన దళం ఎన్డీఆర్‌ఎఫ్‌,ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచాలని హోంమంత్రి సూచించారు. జిల్లా కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.

మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు

తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హోంమంత్రి సూచించారు. బీచ్‌లలోకి పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధించాలని అధికారులను ఆదేశించారు. సముద్రంలో భారీ అలలు ఎగసిపడే ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడం, ఇతర ప్రమాదకర కార్యకలాపాలకు పాల్పడటం వంటివి చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వదంతులను నమ్మొద్దు.. అధికారిక హెచ్చరికలను పాటించాలి

తుపాను ప్రభావం దృష్ట్యా రైతులు, ప్రజలు తమ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత కోరారు. సోషల్‌ మీడియాలో ప్రచారమయ్యే వదంతులను నమ్మవద్దని, వాటిని ఇతరులకు పంపవద్దని సూచించారు. విపత్తుల నిర్వహణ సంస్థ, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) జారీ చేసే అధికారిక హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save