Global Vaartha
Date of Publish : 26/10/2026, 10:49 am
Editor : భవ్య జర్నలిస్ట్

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్‌లపై పోలీసుల నిఘా.. హనీట్రాప్‌లపై విచారణ

జూబ్లీహిల్స్ పబ్‌లపై హైదరాబాద్ పోలీసులు నిఘా పెంచారు. డేటింగ్ యాప్‌ల పేరుతో హనీట్రాప్‌లు, భారీ బిల్లుల వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఐదు నెలల్లో 70 మందికిపైగా బాధితులు.. రూ.35 లక్షలకు పైగా నష్టం జరిగినట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 70కి పైగా ఫిర్యాదులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. వీటిలో 33 ఫిర్యాదులు హైదరాబాద్‌ నుంచి.. మిగిలినవి ఇతర పోలీస్ కమిషనరేట్ల పరిధి నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయమైన మహిళలతో పబ్‌లు, రెస్టారెంట్లకు వెళ్లి భారీ బిల్లులు చెల్లించి మోసపోయినట్లు ఫిర్యాదులు అందినట్లు పోలీసులు చెబుతున్నారు.డేటింగ్ యాప్‌లో పరిచయమైన మహిళతో రెస్టారెంట్‌కు వెళ్లిన శేఖర్‌కు రూ.28 వేల బిల్లు వేసినట్లు సమాచారం. ఈ క్రమంలో అధిక బిల్లులు వసూలు చేస్తున్న పబ్‌లపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్న పబ్‌లపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. హనీట్రాప్ ఫిర్యాదులపై సైబర్ క్రైమ్ పోలీసులు, షీ టీమ్స్ ప్రత్యేకంగా దర్యాప్తు చేయనున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB), హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. మోసం, అక్రమ వసూళ్లు లేదా ఇతర నేరాలు జరిగాయా అనే కోణంలో విచారణ చేపట్టారు. పబ్‌లలో నిర్ణీత సమయం తర్వాత కార్యకలాపాలు, పెద్ద శబ్దాలతో మ్యూజిక్, రోడ్లపై గొడవలపైనా పోలీసులు నిఘా పెట్టారు.

జూబ్లీహిల్స్‌లో 33కు పైగా పబ్‌లు నిర్వహణలో ఉన్నట్లు సమాచారం. ఆదివారం నుంచి గురువారం వరకు అర్ధరాత్రి 12 గంటలలోపు పబ్‌లు మూసివేయాలని, శుక్ర, శనివారాల్లో రాత్రి ఒంటిగంటలోపు మూసివేయాలని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పబ్‌ల యాజమాన్యాలపై చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. శబ్ద కాలుష్యం, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఘటనలపై డయల్ 112కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save