Global Vaartha
Date of Publish : 26/10/2026, 11:18 am
Editor : భవ్య జర్నలిస్ట్

కామారెడ్డి కలెక్టర్ పేరుతో ఫేక్ ఐడీలు.. సైబర్ క్రైమ్ కేసు నమోదు

ఐఏఎస్ అధికారుల పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా కామారెడ్డి కలెక్టర్ పేరిట గుర్తుతెలియని వ్యక్తులు ఫేక్ ఐడీలు సృష్టించడంపై సైబర్ క్రైమ్ కేసు నమోదైంది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేరుతో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఐడీలు క్రియేట్ చేసిన కేటుగాళ్లు.. వాటిని వైరల్ చేస్తున్నట్లు కలెక్టరేట్ అధికారులు గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు.ఈ ఫేక్ ఐడీల ద్వారా మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, కలెక్టరేట్ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ దేవునిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కలెక్టర్ కార్యాలయ ఏవో అహ్మద్ హుస్సేన్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సైబర్ నేరం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై బాల్‌రెడ్డి వెల్లడించారు. నిందితుల ఐపీ అడ్రస్, ఫోన్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉన్నతాధికారుల పేర్లతో వచ్చే మోసపూరిత సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save