Global Vaartha
Date of Publish : 15/10/2026, 1:59 pm
Editor : భవ్య జర్నలిస్ట్

జనసేనలో చేరిన వంగవీటి రాధా.. మేయర్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా?

  • పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
  • విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా రాధా పేరు తెరపైకి
  • స్థానిక ఎన్నికల్లో జనసేనకు సీట్ల కేటాయింపుపై ఉత్కంఠ
  • టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై కొనసాగుతున్న చర్చలు

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. బుధవారం అమరావతిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తిరుపతికి చెందిన ప్రణీత్‌ ప్రమోద్‌ కూడా పార్టీలో చేరారు. రాధాకృష్ణ జనసేనలో చేరడంతో విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఆయన పోటీ చేసే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అయితే, దీనిపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి రాధాకృష్ణ కృషి చేశారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీతో కలిసి పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు జనసేనలో చేరడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తి నెలకొంది. మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మేయర్లు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, జడ్పీ ఛైర్మన్ల పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌లు విడుదల చేసినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో రాధా చేరికకు రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై టీడీపీ, జనసేన నేతలు చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన నేతలు నాదెండ్ల మనోహర్‌, లింగమనేని రమేశ్‌, హరిప్రసాద్‌ సమావేశమైనట్లు సమాచారం. విజయవాడలోని 86 డివిజన్లలో 35 స్థానాలు తమకు కేటాయించాలని జనసేన కోరుతున్నట్లు ప్రచారం జరుగుతుండగా, 15 స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, మేయర్‌ పదవి కూటమిలో ఏ పార్టీకి దక్కుతుంది, రాధాకృష్ణకు అవకాశం లభిస్తుందా అనే అంశాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save