Global Vaartha
Date of Publish : 26/10/2026, 11:22 am
Editor : భవ్య జర్నలిస్ట్

కివీస్‌తో మూడో టీ20కి ఇషాన్ కిషన్ దూరం.. వైభవ్‌కు మరో ఛాన్స్ దక్కుతుందా?

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ మూడో టీ20కి కూడా దూరమయ్యాడు. తొలి టీ20లో తొడ కండరాల గాయం బారిన ఇషాన్.. రెండో టీ20కి కూడా అందుబాటులో లేని సంగతి తెలిసిందే. అతడు ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదని తాజాగా బీసీసీఐ వెల్లడించింది. మరోవైపు రెండో టీ20లో ఇషాన్‌ స్థానంలో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కేవలం నాలుగు పరుగులకే ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో మూడో టీ20లో అతడికి మరో అవకాశం దక్కుతుందా? జట్టు మేనేజ్‌మెంట్‌ బ్యాటింగ్‌ కూర్పులో మార్పులు చేస్తుందా? అనేది ఆసక్తిగా మారింది.

ఇషాన్‌ గాయం నుంచి కోలుకుంటున్నాడని, అయితే మ్యాచ్‌లో ఆడేందుకు అవసరమైన పూర్తి ఫిట్‌నెస్‌ ఇంకా సాధించలేదని బీసీసీఐ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. వైద్య బృందం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తోందని పేర్కొంది. దీంతో ఇషాన్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన కుమార్‌ కుశాగ్ర మూడో టీ20కి కూడా జట్టుతోనే కొనసాగనున్నాడు.

మూడో టీ20లో ఏం జరగనుంది?

ఇషాన్‌ కిషన్‌ అందుబాటులో లేకపోవడంతో భారత జట్టు మేనేజ్‌మెంట్‌ ముందు బ్యాటింగ్‌ కూర్పును నిర్ణయించాల్సిన అవసరం ఏర్పడింది. వైభవ్‌ సూర్యవంశీకి మరో అవకాశం ఇస్తే అతడిని ఓపెనర్‌గా పంపిస్తారా? లేక జట్టు అవసరాల కోసం మిడిలార్డర్‌లోనే కొనసాగిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడంతో పాటు, వారు సహజమైన ఆటతీరుతో రాణించే పరిస్థితులను కల్పించడం కూడా అంతే ముఖ్యమని మాజీ క్రికెటర్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. న్యూజిలాండ్‌తో అక్టోబర్‌ 27న వెల్లింగ్టన్‌లో జరగనున్న మూడో టీ20లో భారత జట్టు ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగుతుందో చూడాల్సి ఉంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save