Global Vaartha
Date of Publish : 26/10/2026, 11:41 am
Editor : భవ్య జర్నలిస్ట్

సొంత ఇలాకలో వైఎస్ జగన్‌కి గట్టి షాక్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అధికారం కోల్పోయ్యారు. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. తాజాగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయనకు గట్టి ఎదురు దెబ్బ తగులుతోంది. సొంత గడ్డ పులివెందుల్లో వైఎస్ జగన్‌‌కు టీడీపీ గట్టి ఝలక్ ఇచ్చింది. పులివెందుల్లోని మొత్తం 40 మున్సిపల్ వార్డుల్లో 20 టీడీపీకి ఏకగ్రీవమయ్యాయి. మరో 20 వార్డులతోపాటు చైర్ పర్సన్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

అలాగే జిల్లాలోని కడప కార్పొరేషన్‌తోపాటు 8 మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంది. జిల్లాలో 9కిగాను 6 మున్సిపల్ చైర్మన్ స్థానాలు టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇక కడప జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు.. రాజంపేట (టీడీపీ), ప్రొద్దుటూరు(టీడీపీ), బద్వేలు(టీడీపీ), మైదుకూరు(టీడీపీ)తోపాటు రెండు నగర పంచాయతీలు కమలాపురం(టీడీపీ), ఎర్రగుంట్ల(బీజేపీ) చైర్‌పర్సన్‌ పదవులను కూటమి పార్టీలు ఏకగ్రీవంగా గెలుచుకున్నాయి.

రాజంపేటలో 32 వార్డుల్లో..14 టీడీపీకి, ఒకటి జనసేనకు ఏకగ్రీవమయ్యాయి. ప్రొద్దుటూరులో 52 వార్డుల్లో.. టీడీపీ అభ్యర్థులు 51చోట్ల, బీజేపీ అభ్యర్థి ఓ చోట ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బద్వేలులో 40 వార్డుల్లో టీడీపీ 35, జనసేన 2 ఏకగ్రీవంగా గెలుచుకున్నాయి. ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా పోటీ లేకుండా గెలిచారు. దీంతో నవంబర్1న 39వ వార్డులో మాత్రమే ఎన్నిక జరుగనుంది.

మైదుకూరులో 32 వార్డులకు 17 చోట్ల టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 15 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. కమలాపురం నగర పంచాయతీలో 23 వార్డుల్లో.. టీడీపీ 22 ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఓ వార్డులో బీజేపీ ఏకగ్రీవమైంది. ఎర్రగుంట్ల నగర పంచాయతీలో 28 వార్డుల్లో.. టీడీపీకి 17, బీజేపీకి 10 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 7వ వార్డుకు ఎన్నిక జరగనుంది. కడప కార్పొరేషన్‌లో 66 డివిజన్లున్నాయి. ఇందులో టీడీపీ 47, బీజేపీ 2, జనసేన 1 వార్డుల్లో ఏకగ్రీవమయ్యాయి. ఇక్కడ మేయర్‌ స్థానంతో పాటు మరో 16 డివిజన్లకు ఎన్నిక జరగనుంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save