Global Vaartha
Date of Publish : 26/10/2026, 11:46 am
Editor : భవ్య జర్నలిస్ట్

దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుఫాన్.. ప్రజలకు హోంమంత్రి అనిత సూచనలివే

బంగాళాఖాతంలో ‘అర్నబ్’ తుఫాన్‌ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత అప్రమత్తం చేశారు. అధికారులతో ఎప్పటికప్పుడు తుఫాన్ గమనాన్ని హోంమంత్రి పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ (సోమవారం) అర్ధరాత్రికి తీవ్ర తుఫాన్‌గా.. రేపటికి అతి తీవ్ర తుపానుగా ‘అర్నబ్’ మారనుంది. ఎల్లుండి ఉదయం బాపట్ల - విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీంతో వాతావరణం ప్రశాంతంగా ఉందనే అపోహలతో అలసత్వం వహించవద్దని ప్రజలకు అనిత సూచనలు చేశారు. రేపు, ఎల్లుండి అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దన్నారు.

తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కి.మీ.వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని హోంమంత్రి తెలిపారు. ప్రభావిత జిల్లాలకు ఇప్పటికే NDRF, SDRF బృందాలు చేరుకున్నాయని, సోషల్ మీడియా వదంతులను నమ్మవద్దన్నారు. ఏపీఎస్‌డీఎమ్‌ఏ (APSDMA), ఆర్టీజీఎస్ (RTGS) ప్రభుత్వ అధికారిక సమాచారాన్నే పాటించాలని వెల్లడించారు. తీరప్రాంత ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత సూచనలు చేశారు.

అధికారులతో మంత్రి నిమ్మల టెలీకాన్ఫరెన్స్

అర్నబ్’ తుఫాన్ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, నదులు, వాగులు, కాలువల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఇన్‌ఫ్లోలు, అవుట్‌ఫ్లోలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నదులు, వాగులు, వంకల్లో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు అవసరమైన ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని తెలిపారు.

ఎక్కడా ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా, రెవెన్యూ, విపత్తు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన సిబ్బంది, యంత్రాలు, ఇతర సామగ్రిని సిద్ధంగా ఉంచాలన్నారు. కాలువలు, డ్రెయిన్లలో నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుఫాన్ పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకునే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాల తీవ్రత దృష్ట్యా, బుడమేరు ఛానెల్ అడ్డంకులు అన్నీ క్లియర్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఏలేరు రిజర్వాయర్ కుషన్ తక్కువగా ఉన్నందున, రిజర్వాయర్ కేచ్మెంట్ ఏరియా వర్షాన్ని బట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు. 2027 మార్చికి పోలవరం నిర్మాణం లక్ష్యానికి అంతరాయం కలుగకుండా, ప్రత్యామ్మాయ పద్దతుల ద్వారా పనులు జరగాలని అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశాలు జారీ చేశారు. టెలీకాన్ఫరెన్స్‌లో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, మరియు ఎస్‌ఈలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save