Global Vaartha
Date of Publish : 26/10/2026, 11:52 am
Editor : భవ్య జర్నలిస్ట్

మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు.. నలుగురు నిందితుల అరెస్టు

మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితురాలు కల్పన సహా నలుగురిని అరెస్టు చేశారు. ఈ ఏడాది మే 7న తనూజ రంజన్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమె ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న కల్పనతో పాటు అనుచరులు ఆ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆమెను హత్య చేసిన అనంతరం నగలు, నగదుతో పాటు మృతురాలి ఒంటిపై ఉన్న ఆభరణాలను కూడా దొంగిలించి పారిపోయారు. నిందితులు బిహార్ మీదుగా నేపాల్‌కు పరారయ్యారు. వారి కోసం ఐదు నెలల పాటు పోలీసులు గాలించారు.మూడు దఫాలుగా నేపాల్‌కు వెళ్లిన హైదరాబాద్ పోలీసులు.. నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. సాధారణ పౌరుల్లా వేషధారణ వేసుకొని సమాచారం సేకరించారు. దాదాపు 25 రోజుల పాటు నేపాల్‌లోనే మకాం వేశారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ పర్యవేక్షణలో ఆపరేషన్ నిర్వహించారు. ప్రధాన నిందితురాలు కల్పన కుమారుడి కదలికల ద్వారా కీలక సమాచారం సేకరించారు. ముంబైకి వచ్చిన కల్పన కుమారుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడి ద్వారా కల్పనను రప్పించి పట్టుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన నిందితులను కూడా వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు ఢిల్లీలో మరో దోపిడీ కేసులోనూ సహకరించినట్లు సమాచారం. నేపాల్ చట్టాలు, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా నిందితులను త్వరలో హైదరాబాద్‌కు తీసుకొచ్చి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save