Global Vaartha
Date of Publish : 26/10/2026, 11:59 am
Editor : భవ్య జర్నలిస్ట్

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవాన్ని సోమవారం జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న వారిందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవం సందర్భంగా, రూబీ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న విద్యార్థులు, అధ్యాపకులు, వైద్యులు, పరిశోధకులు, సిబ్బంది అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు‘.’దివంగత శ్రీ ఎన్టీఆర్ గారి సంకల్పంతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం నాలుగు దశాబ్దాలుగా వైద్య విద్య, పరిశోధన, ప్రజారోగ్య రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. నాణ్యమైన వైద్య విద్యతో సమాజానికి నిబద్ధత కలిగిన వైద్యులను అందించడం గర్వకారణం. వైద్యం ఒక వృత్తి మాత్రమే కాదు.. ప్రాణాలను కాపాడే పవిత్రమైన బాధ్యత. సాంకేతికత వైద్యానికి శక్తిని ఇస్తే.. మానవత్వం ఆ వైద్యానికి మరింత విలువ చేకూరుస్తుంది. 40 ఏళ్ల వైద్య సేవా స్ఫూర్తితో ఈ విశ్వవిద్యాలయం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save