Global Vaartha
Date of Publish : 26/10/2026, 12:01 pm
Editor : భవ్య జర్నలిస్ట్

హైదరాబాద్‌ బోరబండలో విషాదం.. విద్యుత్ షాక్‌‌తో మహిళ మృతి

హైదరాబాద్‌లోని బోరబండలో విషాద ఘటన జరిగింది. విద్యుత్ షాక్‌తో మహిళ మృతి చెందింది. హీటర్‌తో నీళ్లు వేడి చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. బోరబండలోని భరత్ నగర్‌లో ఉస్మాన్ ఇంట్లో ఆయేషా సిద్దిఖి (26) అనే మహిళ అద్దెకు ఉంటోంది. హీటర్‌లో ఆమె నీళ్లు పెట్టింది. స్టీల్ మగ్‌తో బకెట్‌లో నీళ్లు తీస్తుండగా కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయంలో ఆయేషా భర్త అబ్దుల్ రవూఫ్ బయట ఉన్నారు. ఆయేషా, రవూఫ్‌ది నిజామాబాద్ జిల్లా గాంధారి. రెండేళ్ల క్రితం వారికి వివాహం జరిగింది. వారికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. సమాచారం అందుకున్న బోరబండ ఇన్‌స్పెక్టర్ బి.రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘట్కేసర్‌లో అనుమానాస్పద స్థితిలో యువకుడు

ఘట్కేసర్‌లో అనుమానాస్పద స్థితిలో యువకుడు చనిపోయాడు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. ఎదులాబాద్‌లోని లివిన్ ఫాంహౌస్‌లో ఈ ఘటన జరిగింది. మృతుడిని ఉప్పల్ భగాయత్‌కు చెందిన కృష్ణ కౌండిన్య (21) గా గుర్తించారు. బీటెక్ పూర్తి చేసిన కృష్ణ కౌండిన్య.. ఈనెల 24న రాత్రి స్నేహితుడు రిషబ్‌తో కలిసి ఫాంహౌస్‌కు వెళ్లాడు. ఆదివారం ఉదయం అతను అపస్మారక స్థితిలో కనిపించాడు. ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి విశ్రాంత పోలీసు అధికారి ప్రవీణ్ కుమార్. యువకుడి మృతికి గల కారణాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save