Global Vaartha
Date of Publish : 26/10/2026, 12:53 pm
Editor : భవ్య జర్నలిస్ట్

హోటల్ గదిలో నవవధువు మృతి.. సీసీటీవీలో కీలక దృశ్యాలు

 ఉత్తర్ ప్రదేశ్‌ ఝాన్సీలోని ఓ హోటల్ గదిలో 28 ఏళ్ల నవవధువు ముస్కాన్ సిమోలియా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. వివాహమైన మూడు నెలలకే ఈ దారుణం జరిగింది. మధ్యప్రదేశ్‌లోని విదిశాకు చెందిన బ్యాంకు మేనేజర్ నిలేష్‌తో ముస్కాన్‌కు జూన్ 29, 2026న వివాహం జరిగింది. పెళ్లి తర్వాత తన భర్త నిలేష్‌కు ఇదివరకే పెళ్లయిందని, అతని మొదటి భార్య ఇండోర్‌లో నివసిస్తోందని ముస్కాన్‌కు తెలిసింది. ఈ విషయమై భర్త తరచూ ఆమెను వేధింపులకు గురిచేసేవాడని మృతురాలి తండ్రి రామ్‌జీ లాల్ అహిర్వార్ ఆరోపించారు.

ఘటనకు ముందు ఏం జరిగింది?

రైల్వే జూనియర్ ఇంజనీర్ (JE) పరీక్షకు సిద్ధమవడానికి ముస్కాన్ అక్టోబర్ 10 నుంచి పుట్టింట్లోనే ఉంటోంది. అక్టోబర్ 23న భర్త నిలేష్ వచ్చి, అత్తగారింటికి తీసుకెళ్తానని చెప్పి ఆమెను ఝాన్సీలోని 'రిషభ్ హోటల్' (రూమ్ నంబర్ 212) కి తీసుకెళ్లాడు. అక్టోబర్ 24న హోటల్ నుంచి చెక్-అవుట్ అయ్యే సమయంలో ముస్కాన్ గదిలోనే అకస్మాత్తుగా కుప్పకూలిపోయిందని, వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని నిలేష్ పోలీసులకు చెప్పాడు.

పోలీసు అధికారులు హోటల్ సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, ముస్కాన్ గదిలోనే కింద పడిపోవడం రికార్డయిందని తెలిపారు. అయితే ముస్కాన్ కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తూ, మొదటి భార్య ఉన్న విషయాన్ని దాచి పెళ్లి చేసుకున్నాడని భర్త నిలేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు భర్త నిలేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.(Jhansi Newlywed Woman Death)

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save