Global Vaartha
Date of Publish : 26/10/2026, 1:41 pm
Editor : భవ్య జర్నలిస్ట్

కివీస్-ఎతో మ్యాచ్: 199 పరుగుల వద్ద ఔట్‌.. అంపైర్‌ నిర్ణయంపై పడిక్కల్‌ అసహనం!

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ దురదృష్టకర రీతిలో డబుల్‌ సెంచరీ చేజార్చుకున్నాడు. న్యూజిలాండ్‌-ఎతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో అద్భుతంగా ఆడిన అతడు.. 199 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వివాదాస్పద నిర్ణయంతో పెవిలియన్‌కు చేరాడు. జాక్‌ గిబ్సన్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ మిచెల్‌ హేకు క్యాచ్‌ అందుకోవడంతో అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. అయితే బ్యాట్‌కు, బంతికి మధ్య చాలా దూరం ఉందంటూ పడిక్కల్‌ అసహనం వ్యక్తం చేశాడు. అనధికారిక టెస్టు కావడంతో డీఆర్ఎస్ విధానం అందుబాటులో లేదు. దీంతో పడిక్కల్ రివ్యూ తీసుకోవడానికి వీలు పడలేదు. డబుల్‌ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో వెనుదిరగడంతో అతడి నిరాశ స్పష్టంగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.న్యూజిలాండ్‌-ఎతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత్‌-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులు సాధించింది. దీంతో ఆ జట్టుకు 204 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ప్రారంభమైన తర్వాత పడిక్కల్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. పడిక్కల్‌, సాయి సుదర్శన్‌ కలిసి మూడో వికెట్‌కు 215 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సాయి సుదర్శన్‌ 91 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం యశ్‌ రాథోడ్‌తో కలిసి పడిక్కల్‌ మరో కీలక భాగస్వామ్యాన్ని నిర్మించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 142 పరుగులు జోడించారు. రాథోడ్‌ 66 పరుగులు సాధించాడు. మూడో రోజు ఆట పూర్తయ్యే సమయానికి భారత్-ఎ 8 వికెట్ల నష్టానికి 488 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(51*), ఆకాశ్ దీప్(0*) ఉన్నారు. కివీస్-ఎపై భారత్-ఎ జట్టు 284 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save