Global Vaartha
Date of Publish : 26/10/2026, 2:27 pm
Editor : భవ్య జర్నలిస్ట్

వందల ఏఐ క్లౌడ్ స్టార్టప్‌లు కనుమరుగవుతాయి: మస్క్ హెచ్చరిక

ఏఐ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులతో కంప్యూటర్‌ చిప్‌లకు డిమాండ్‌ భారీగా పెరిగింది. దీంతో ఏఐ సేవల కోసం డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయి. అయితే, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టిన చిన్నచిన్న కంపెనీలకు త్వరలో కష్టకాలం వస్తుందని టెక్‌ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ హెచ్చరించారు. వందల ఏఐ క్లౌడ్‌ స్టార్టప్‌లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన తన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌‌లో పేర్కొన్నారు.ఏఐ డేటా సెంటర్లపై మాత్రమే ఆధారపడి ఆదాయం పొందే సంస్థలకు రుణాలు ఇచ్చేందుకు రుణదాతలు వెనుకడుగు వేస్తున్నారని మస్క్ అన్నారు. ఇతర సంస్థలకు ఏఐ చిప్‌లు, కంప్యూటింగ్‌ సామర్థ్యాన్ని అద్దెకు ఇచ్చే చిన్న క్లౌడ్‌ సేవల కంపెనీలు (నియోక్లౌడ్స్‌) 200కుపైగా తీవ్ర కష్టాల్లో ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఆ సంస్థల్లో చాలా వరకు కనుమరుగవుతాయని, మిగిలినవి ఇతర కంపెనీల్లో విలీనం కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. ‘ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు భారీగా పెట్టుబడులు అవసరమవుతాయి. అత్యాధునిక గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను (జీపీయూ) కొనుగోలు చేసి నిర్వహించేందుకు భారీ మొత్తంలో కరెంట్ కావాలి. పెట్టుబడుల కోసం రుణాలపై ఆధారపడే కంపెనీలకు ప్రస్తుతం రుణాలు ఇచ్చే కంపెనీల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదు. ఆర్థిక వనరులు బాగా ఉన్న కంపెనీల వైపు మాత్రమే రుణదాతలు చూస్తున్నారు’ అని మస్క్ వివరించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save