జవహర్ నగర్ డంపింగ్ యార్డు తరలించాలంటూ ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన మహాపాదయాత్ర ప్రారంభమైంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో పాదయాత్ర సాగనుంది. జవహర్ నగర్ డంపింగ్ యార్డు తరలింపుపై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ పాదయాత్రను మొదలుపెట్టారు. ఈరోజు ఏదులాబాద్ నుంచి మొదలై నాలుగో రోజు జవహర్ నగర్లో ముగియనుంది. ఈ సందర్భంగా ఏబీఎన్‌తో ఎంపీ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ అయిన మల్కాజిగిరిలో డంపింగ్ యార్డు సమస్య వల్ల లక్షలాది మంది ప్రజలు రోడ్డున పడే దుస్థితి వచ్చిందని తెలిపారు.విపరీతమైన చెత్త వల్ల ఆ ఏరియా నుంచి ముప్పై కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని ఎంపీ అన్నారు. దీనిపై అనేక సార్లు ముఖ్యమంత్రిని కలిసినా ఫలితం లేదని విమర్శించారు. తన నియోజకవర్గ ప్రజల సమస్యను తానే స్వయంగా ప్రభుత్వం దృష్టికి మరోసారి తీసుకురావాలి ఈ యాత్ర మొదలు పెట్టినట్లు చెప్పారు. ఈరోజు ఏదులాబాద్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాత్ర ప్రారంభమైందన్నారు. నాలుగో రోజు మహాసభ నిర్వహించి పాదయాత్రను ముగిస్తామని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.